సీఎం జగన్ ఒడిశా (CM Jagan Odisha Tour news)కు బయల్దేరారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరిన సీఎం.. మధ్యాహ్నం 1.15 గంటలకు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం చేరుకున్నారు. పాతపట్నంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. అక్కడ్నుంచి ప్రత్యేక విమానంలో.. భువనేశ్వర్‌కు చేరుకున్నారు.
ఒడిశా సీఎంతో భేటీ..
భువనేశ్వర్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్.. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నివాసంలో ఆయనతో భేటీ కానున్నారు. రెండు రాష్ట్రాలకు చెందిన వివిధ పెండింగ్ అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు భువనేశ్వర్ నుంచి బయలుదేరి 9 గంటలకు తాడేపల్లి నివాసానికి జగన్ చేరుకోనున్నారు.
చర్చించే అంశాలు..
ఒడిశా సీఎంతో భేటీలో ప్రస్తావించాల్సిన అంశాలపై ఉన్నతాధికారులతో సోమవారం ఆయన సన్నాహక సమావేశం నిర్వహించారు. ‘‘నేరడి బ్యారేజీ వల్ల ఉభయ రాష్ట్రాలకు చేకూరే ప్రయోజనాలను నవీన్ పట్నాయక్‌కు జగన్ వివరిస్తారు. బ్యారేజీ నిర్మాణానికి ఒడిశాలో 103 ఎకరాలు అవసరమని, దానిలో 67 ఎకరాలు రివర్‌బెడ్ ప్రాంతమేనని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. బ్యారేజీ నిర్మిస్తే ఒడిశా వైపు కూడా సుమారు 5-6 వేల ఎకరాలకు తక్షణమే సాగునీరందుతుందని చెప్పారు...’’ అని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘జంఝావతి ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం రబ్బర్‌డ్యాం ఆధారంగా సాగునీరు అందజేస్తున్నాం. 24,640 ఎకరాలకుగాను కేవలం 5 వేల ఎకరాలకు మాత్రమే నీరు ఇవ్వగలుగుతున్నాం. ప్రాజెక్టును పూర్తి చేస్తే ఒడిశాలో 4 గ్రామాలు పూర్తిగా, ఆరు గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురవుతాయి. ఒడిశాలో దాదాపు 1,174 ఎకరాల భూమి ముంపునకు గురవుతుంది. దానిలో 875 ఎకరాలు ప్రభుత్వ భూమే. ఈ విషయాలను నవీన్ పట్నాయక్‌తో భేటీలో జగన్ వివరిస్తారు. సహాయ, పునరావాస కార్యక్రమాలకు సహకరించాలని కోరతారు’’ అని వివరించింది. ‘‘కొఠియా గ్రామాల వివాదం, ఇటీవల అక్కడ చోటు చేసుకున్న పరిణామాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 21 కొఠియా గ్రామాల్లో... 16 ఆంధ్రప్రదేశ్‌తోనే ఉంటామని తీర్మానాలు చేసి ఇచ్చాయని, ఇటీవల అక్కడ ఎన్నికలు కూడా నిర్వహించామని తెలిపారు. కొఠియా గ్రామాల్లో దాదాపు 87 శాతం గిరిజనులు ఉన్నారని, వారికి సేవల్లో అవాంతరాలు ఎదురవకుండా చూడాల్సి ఉందని తెలిపారు’’ అని సీఎం కార్యాలయం పేర్కొంది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి..భాజపా నేతలకు మంత్రి కొడాలి నాని వార్నింగ్