ముఖ్యమంత్రి జగన్...దిల్లీలో ప్రధాని నరేంద్రమోదీతో సుమారు గంటన్నరపాటు సమావేశమయ్యారు. నదుల అనుసంధానంతోపాటు, నవరత్నాలకు చేయూతనివ్వాలని ప్రధానిని కోరారు. పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదించాలని విజ్ఞప్తి చేసిన సీఎం... రివర్స్ టెండరింగ్ ద్వారా సుమారు 838 కోట్లు ఆదా చేసినట్లు ప్రధానికి వివరించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నవరత్నాలకు చేయూతనివ్వాలని... ఇవన్నీ జాతీయస్థాయిలో చేపట్టదగిన పథకాలేనని.. పైలట్ ప్రాజెక్ట్‌లుగా అమలు చేయాలని కోరారు. ఈనెల 15న రైతు భరోసా పథకం ప్రారంభోత్సావానికి రావాల్సిందిగా ప్రధాని నరేంద్రమోదీని జగన్ ఆహ్వానించారు.
నదుల అనుసంధానికి సహకరించాలి
కొన్నేళ్లుగా కృష్ణానదికి వరద నీరు రాక.. కృష్ణా డెల్టాతోపాటు, రాయలసీమ ప్రాంతం తీవ్ర కరవు ఎదుర్కొంటోందని....మరోవైపు వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రం పాలవుతున్నాయని ప్రధానికి జగన్ వివరించారు. వృథాగా పోతున్న ఈ నీటిని కృష్ణానదికి తరలిస్తే...రాష్ట్రం సస్యశ్యామలవుతుందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మలుపుతిప్పే నదుల అనుసంధానం ప్రాజెక్ట్‌కు సహకరించాలని కోరారు. ఈ వ్యవహారంపై ఆయా శాఖల మంత్రులకు తగిన ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు.
- కేంద్రం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 61 వేల కోట్లకు పైగా అవసరమవుతాయని... కానీ ఇప్పటి వరకు కేవలం 6 వేల 739 కోట్లు మాత్రమే విడుదల అయ్యాయని సీఎం ప్రధానికి వివరించారు. గత ప్రభుత్వ బకాయిలే 50వేల కోట్ల వరకు ఉన్నాయన్నారు.
- గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద వచ్చే నిధులకు అదనంగా మరో 40 వేల కోట్లు ఇవ్వాలని జగన్ విజ్ఞప్తి చేశారు.
- రెవెన్యూ లోటు 22 వేల 948 కోట్లకు గానూ...కేవలం 3వేల 979 కోట్లు మాత్రమే విడుదలయ్యాయని...మిగిలిన సొమ్ము ఇప్పించాలని కోరారు.
- పోలవరం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 5 వేల 103 కోట్లతోపాటు ...ప్రాజెక్ట్ పనులు శరవేగంగా సాగేందుకు మరో 16 వేల కోట్లు ఇవ్వాలని సీఎం ప్రధానికి విజ్ఞప్తి చేశారు. సవరించిన ప్రాజెక్ట్ అంచనాలను ఆమోదించాలన్నారు.
- రివర్స్ టెండరింగ్ ద్వారా 838 కోట్లు ఆదా చేసినట్లు జగన్ వివరించారు.
ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ వర్తింపజేయాలి
బుందేల్‌ఖండ్, కలహండి తరహాలోనే రాష్ట్రంలో వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని వర్తింపజేయాలని కోరారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కడప స్టీల్‌ప్లాంట్, రామాయపట్నం పోర్టులను కేంద్రం నిర్మించాల్సి ఉందని.. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఈ ప్రాజెక్టులు ఎంతో కీలకమైనవని.. విశాఖపట్నం, చెన్నై ఇండస్ట్రియ్ కారిడార్, కాకినాడ పెట్రోలియం కాంప్లెక్స్‌కూ తగిన రీతిలో నిధులు విడుదల చేయాలని సీఎం కోరారు.
విభజనతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోవాలని ముఖ్యమంత్రి జగన్....ప్రధానిని కోరారు. రాష్ట్రంలో పరిశ్రమలు, సేవారంగం పురోగమించాలంటే ప్రత్యేక రాయితీలు తప్పనిసరని సీఎం విజ్ఞప్తి చేశారు.