ఈనెల నవంబరు 30 తేదీ నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో ఉభయసభల్లో వ్యవహరించాల్సిన తీరుపై ముఖ్యమంత్రి జగన్ మంత్రులకు దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం కొద్దిసేపు మంత్రులతో మాట్లాడారు. ఉభయసభల్లోనూ అధికార పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మండలిలో అధికార పార్టీ కంటే ప్రతిపక్ష పార్టీదే పైచేయి అవుతుండటంపై ప్రత్యేకంగా చర్చించినట్టు తెలుస్తోంది.
ఈ సారి శాసనమండలి సమావేశాల్లో ప్రతిపక్షాన్ని కట్టడి చేసేందుకు ముందస్తుగానే సిద్ధం కావాలని సూచించినట్టు సమాచారం. ఉభయసభల్లోనూ చర్చలకు పూర్తిగా మంత్రులు, సభ్యులు అంశాల వారీగా సిద్ధమై ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా ఉండాలని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పక్కా ప్రణాళికలతో ఉండాలని జగన్ మంత్రులకు సూచించినట్టు తెలిసింది. ఈ మేరకు శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మిగిలిన మంత్రులతో సమన్వయం చేసుకోవాలని సీఎం ఆదేశించినట్టు సమాచారం.
అటు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు అంశంపై జరుగుతున్న ప్రచారం పైనా ఎదురుదాడికి సిద్ధం కావాల్సిందిగా మంత్రులను సీఎం ఆదేశించినట్టు సమాచారం. పోలవరం ఎత్తును కుదిస్తామంటూ లేని విషయాన్ని వివాదంగా మార్చి ప్రతిపక్షం బురదజల్లే ప్రయత్నం చేస్తోందని సీఎం స్పందించినట్టు తెలుస్తోంది. దీనిపై గట్టిగా సమాధానమివ్వాలని.. పోలవరం ఎత్తు కుదించే ప్రసక్తే ఉండదని సీఎం మంత్రులకు స్పష్టం చేసినట్టు తెలిసింది.
ఇదీ చదవండి