దిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ రెండో రోజు కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను ఆయన నివాసంలో కలిశారు. అరగంట పాటు ఇరువురి భేటీ కొనసాగింది. పోలవరం ప్రాజెక్టు రెండోసారి సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించాలని కేంద్రమంత్రిని సీఎం జగన్ కోరినట్లు తెలిసింది. 2017-18 నాటి ధరల ఆధారంగా సవరించిన పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని 55,656 కోట్ల రూపాయలను ఆమోదించాలని విజ్ఞప్తి చేసిన సీఎం.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ, పునరావాస వ్యయాన్ని కూడా కేంద్రమే భరించాలని విన్నవించారు. నిర్వాసితుల సంఖ్య గణనీయంగా పెరగటంతో పునరావాస ఖర్చు అధికమైందని వెల్లడించారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేయకపోతే ఆ ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఆయన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
రాష్ట్రానికి జలశక్తి శాఖ సలహాదారు
ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో రావాల్సిన 1779 కోట్ల రూపాయలను తక్షణమే చెల్లించేలా చూడాలని గజేంద్రసింగ్‌ను ముఖ్యమంత్రి జగన్ కోరారు. నదుల అనుసంధానంపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు శ్రీరామ్‌ను రాష్ట్రానికి పంపించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఈ మేరకు శ్రీరామ్‌ను త్వరలో ఏపీ వెళ్లి గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై చర్చలు జరపాలని గజేంద్ర సింగ్ షెకావత్ ఆదేశించారు. కేంద్ర జలశక్తి మంత్రితో భేటీ ముగిసిన తర్వాత నేరుగా విమానాశ్రాయానికి వెళ్లిన సీఎం జగన్.. ఉదయం పదిన్నర గంటలకు దిల్లీ నుంచి విజయవాడకు వెళ్లారు.
3 రాజధానులపై చర్చ
రెండు రోజుల పర్యటన కోసం మంగళవారం సాయంత్రం దిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి.. అదే రోజు రాత్రి 8.30కి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో గంటసేపు సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు, పరిహారం, పునరావాసం వ్యయానికి నిధులు ఇచ్చేలా చూడాలని అమిత్ షాను కోరారు. ప్రత్యేక హోదా, మూడు రాజధానుల వ్యవహారం, కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులు సహా కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి రాష్ట్ర సంసిద్ధతపై చర్చించినట్లు తెలిసింది.
ఇదీ చదవండి: