కేంద్రం ప్రవేశపెట్టిన హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబరు(హెచ్‌యూఐడీ) విధానం కార్పొరేట్ వ్యాపారులకు అనుకూలంగా మారుతుందని బంగారం వర్తకులు వాపోయారు. ఈ నెల 16 నుంచి అమల్లోకి వచ్చిన హెచ్‌యూఐడీ విధానంతో చిన్న వ్యాపారుల దుకాణాలు మూతపడే పరిస్థితి వస్తుందని అసోసియేషన్ నేతలు పేర్కొన్నారు. కేంద్ర విధానానికి నిరసనగా ‘ది ఏపీ బులియన్ గోల్డ్ సిల్వర్ అండ్ డైమండ్ బులియన్ మర్చంట్స్ ఆసోసియేషన్’ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలోని బంగారం వర్తకులు ఒక్కరోజు సమ్మెను నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 వేల బంగారం దుకాణాలు సోమవారం మూతపడ్డాయి.
కేంద్ర నిర్ణయానికి నిరసనగా అన్ని జిల్లాలు, నియోజకవర్గ కేంద్రాల్లో వ్యాపారులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు, మంత్రులు, ఎంపీలు, నియోజకవర్గాల ఎమ్మెల్యేలను కలిసి వినతిపత్రాలను అందించారు. చిన్న వ్యాపారులను ఇబ్బంది పెట్టేలా హెచ్‌యూఐడీ పేరిట కొత్తగా తెచ్చిన నిబంధనలను ఉపసహరించాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేట వచ్చిన భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావును కలిసి అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్‌కుమార్, ఇతర నేతలు కలిసి వినతిపత్రాన్ని ఇచ్చారు.