కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు,ర్యాలీలు చేపట్టారు. పలు చోట్ల మాస్కులు పంపిణి చేశారు. ప్రధాని పిలుపు మేరకు జనతా కర్ఫ్యూకు ప్రజలందరూ సహకరించాలని పలువురు విజ్ఞప్తి చేశారు.
జనతా కర్ఫ్యూకు పెట్రోల్ బంకుల డీలర్లు మద్దతు
జనతా కర్ఫ్యూకు పెట్రోల్ బంకుల డీలర్లు సంఘీభావం ప్రకటించారు. అత్యవసర సేవల కోసం బంకుల్లో ఇద్దరు సిబ్బందిని మాత్రమే అందుబాటులో ఉంచుతామన్నారు. వీరికి అవసరమైన అన్ని సదుపాయాలను బంకు యజమానులు సరఫరా చేయనున్నట్లు రాష్ట్ర పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గోపాలకృష్ణ తెలిపారు.
అనకాపల్లి పీయస్‌లో విన్నూత్న కార్యక్రమం
కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించేలా విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. పోలీస్ స్టేషన్‌కి వచ్చే ఎవరైనా చేతులు కడుక్కొని లోనికి రావాలని సిబ్బంది చెబుతున్నారు. స్టేషన్‌కి ఎదుట కుళాయిని ఏర్పాటు చేసి హ్యాండ్ వాష్ లోషన్లు, సబ్బులను ఏర్పాటు చేశారు.
శుభ్రతతోనే కరోనా నివారణ
కరోనా వైరస్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కడప ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు బాలిరెడ్డి అన్నారు. వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని చెప్పారు.
శ్రీకాళహస్తిలో పూజలు
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లోక సంక్షేమం కోసం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో రాహు కేతు పూజ నిర్వహించారు. మణికంఠ ఆలయంలో సౌర హోమం, మాన్య సూక్తి హోమం, రోగ నివారణ పూజలు చేపట్టారు. ఔషధ మూలికలతో పూర్ణాహుతి నిర్వహించారు. లోకమంతా సుభిక్షంగా ఉండాలని ప్రార్థనలు చేశారు.
ఆమదాలవలసలో అవగాహన ర్యాలీ
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పోలీస్ సర్కిల్ కార్యాలయం సీఐ బి.ప్రసాదరావు ఆధ్వర్యంలో ఆమదాలవలస పట్టణంలో కరోనా వైరస్ పై అవగాహన ర్యాలీ చేపట్టారు. భయంకరమైన వ్యాధి అయిన కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం పరిధిలోని ప్రధాన ఆలయాలన్నీ స్వామివారి దర్శనం అనంతరం మూసివేశారు. మరోవైపు కరోనాను ఎదుర్కొనేందుకు జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు.
మన ఆరోగ్యం మన చేతల్లోనే
ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మన ఆరోగ్యం మన చేతుల్లోనే, అందరి ఆరోగ్యం మన అందరి బాధ్యత, కరోనాపై అవగాహనే నివారణ మార్గం, అంటూ ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రజలకు హోమియోపతి మందు ( ఆర్సాల్బ్ ) పంపిణీ చేశారు.
మాస్కులు ధరించండి
కృష్ణా జిల్లా మైలవరం మండల వ్యాప్తంగా గ్రామాల్లో కరోనా వ్యాధి నివారణకు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉద్యోగులందరకి మాస్కులు పంపిణీ చేశారు. జగ్గయ్యపేట మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కరోనా నివారణ అవగాహన సమీక్ష సమావేశంలో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను పాల్గొన్నారు. మున్సిపల్, వైద్యారోగ్య, పోలీస్, రవాణా, ఆర్టీసీ, మార్కెటింగ్, రైతుబజార్, ఎక్సయిజ్ తదితర అన్ని శాఖలకు సూచనలు చేశారు. అన్ని మతాల ప్రార్థన మందిరాల ప్రతినిధులు సామూహిక ప్రార్ధనలు ఆపేయాలని కోరారు.
కరపత్రాలతో అవగాహన
విజయవాడ నగర శివారు ప్రాంతాల్లో జనతా కర్ఫ్యూని పురస్కరించుకొని ఆటోల్లో ప్రయాణికులు కరోనా వైరస్‌పై ట్రాఫిక్ పోలీసులు కరపత్రాల పంపిణీ చేశారు. ఆదివారం గృహాల నుండి బయటకు రావద్దని సూచించారు.
ఇవీ చదవండి: