CJI Visits Ramappa: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న సీజేఐ దంపతులకు ఎంపీ కవిత, ఎమ్మెల్యే సీతక్క, ములుగు జిల్లా కలెక్టర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తదితరులు ఘన స్వాగతం పలికారు. సీజేఐ పర్యటన నేపథ్యంలో అధికారులు ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. సీజేఐ హోదాలో తొలిసారి రామలింగేశ్వరస్వామి ఆలయ దర్శనానికి వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణకు పోలీసులు గౌరవ వందనంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు శాలువాతో పూర్ణకుంభంతో సత్కరించారు. రామప్ప ఆలయంలో రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. ఆలయ గైడ్ రామప్ప దేవాలయ శిల్ప కళా సంపద విశిష్టత గురించి వారికి వివరించారు.
ఆలయ విశిష్టత విశ్వవ్యాప్తం
CJI justice NV Ramana: ఎనిమిది వందల ఏళ్ల క్రితం ఆకృతి దాల్చిన రామప్పకు యునెస్కో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందడం గర్వకారణమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి అభిప్రాయపడ్డారు. ఇసుక పునాదులపై ఆలయ నిర్మాణం, నీటిలో తేలియాడే ఇటుకలతో గోపురాన్ని తీర్చిదిద్దడం, శతాబ్దాలు గడిచినా నేటికి వన్నె తగ్గని శిల్పకళాసంపద వల్లే ఆలయ విశిష్టత విశ్వవ్యాప్తమైందన్నారు. శతాబ్దాల క్రితమే అపూర్వ సాంకేతిక నైపుణ్యాన్ని రామప్ప రూపంలో అందించారని సీజేఐ కొనియాడారు. తెలుగునేలపై అరుదైన చారిత్రక కట్టడంగా రామప్ప నిలిచిపోయిందని ప్రశంసించారు. అద్భుత శిల్ప కళాప్రతిభకు ప్రపంచ వారసత్వ హెూదా దక్కడం సముచితమని సీజేఐ కితాబిచ్చారు. మహాశిల్పి రామప్ప, కాకతీయ రేచర్ల రుద్రుడు సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
ఘనస్వాగతం
రామప్ప సందర్శనకు విచ్చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దంపతులకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, హైకోర్టు న్యాయవాదులు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాయమూర్తులు, అడ్వొకేట్లు ఘనంగా స్వాగతం పలికారు.
వరంగల్లో బస
ఆలయ దర్శనం అనంతరం సీజేఐ అక్కడి నుంచి వరంగల్ చేరుకున్నారు. ఇవాళ రాత్రి నిట్ అతిథి గృహంలో బస చేయనున్నారు. ఆదివారం ఉదయం నగరంలోని భద్రకాళి అమ్మవారి దర్శనం తర్వాత కోర్టు భవనం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.
ఇదీ చదవండి:
Liquor Rates Reduced in AP: మందుబాబులకు గుడ్ న్యూస్.. మద్యం ధరలు తగ్గిస్తూ ఉత్తర్వులు