తెలంగాణలోని హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయంలో కిన్నెర ఆర్ట్ థియేటర్ ఆధ్వర్యంలో ప్రముఖ క్యాన్సర్ వైద్యులు నోరి దత్తాత్రేయుడి(Nori Dattatreyudu) స్వీయ ఆత్మకథ 'ఒదిగిన కాలం' పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. శ్రీ విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ(CJI NV Ramana).. డాక్టర్ నోరికి వీడియో ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మూర్తీభవించిన మానవత్వానికి నిదర్శనమైన నోరి... ఏడుపదుల జీవితాన్ని, ఎన్నెన్నో ఉన్నత శిఖరాలు ఎదిగిన వైనాన్ని 'ఒదిగిన కాలం' పేరుతో ఆత్మకథను అందించి సమాజానికి ఎంతో మేలు చేశారని జస్టిస్ రమణ(CJI NV Ramana) కొనియాడారు. భవిష్యత్‌లో ఆయన మరిన్ని ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఎన్నో సవాళ్లు..
చిన్నప్పుడే తండ్రిని కోల్పోయి బాల్యంలో ఆయన ఎదుర్కొన్న ఇక్కట్లు, డాక్టరు అయ్యే క్రమంలో ఆయన ఎదుర్కొన్న సవాళ్లు, వృత్తి జీవితంలో ఆయన అనుభవాలు, క్యాన్సర్ థెరపీలో ఆయన ఆలోచనలు, అమెరికాలో ఆయన పరిశోధనలు, ఆధ్యాత్మికత వైపు ఆయన ఆలోచనలు ఇలా అన్నింటినీ ఉటంకిస్తూ ఆత్మకథలో డాక్టర్ నోరి దత్తాత్రేయుడు.. రాసుకొచ్చారు.ఈ సంకలనంలో అరుణపప్పు.. ఆయనకు రచనా సహకారం అందజేశారు. ఈ పుస్తకాలు విక్రయించగా వచ్చిన సొమ్మును సైతం.. క్యాన్సర్ నివారణ కార్యక్రమాలకు వినియోగిస్తామని డాక్టర్ తెలిపారు. తెలుగుబిడ్డగా, భారతీయుడిగా పుట్టినందుకు గర్విస్తున్నానని.. నేను ఇంతటి వాడిగా ఎదగటంలో తన తల్లిదండ్రులు, భార్య, గురువులు, భగవంత్ సంకల్పం కారణమని నోరి దత్తాత్రేయుడు అన్నారు. కుటుంబం, ఆత్మీయులు, సమాజం ఈ మూడింటిని వేరు చేయకుండా.. చేసే పనినే దైవంగా భావించే శ్రమించటం వల్ల నాకీ విజయాలు దక్కాయని ఆయన పేర్కొన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణంలో తాము అప్పుడు పడ్డ కష్టం.. ఇప్పుడు ఆసుపత్రి ఘనత, సేవలను చూస్తే గర్వంగా ఉందని డాక్టర్ అన్నారు.
ప్రభుత్వాలు వినియోగించుకోవాలి..
క్యాన్సర్ చికిత్సలో ప్రపంచ ప్రఖ్యాతి గడించిన డాక్టర్ నోరి దత్తాత్రేయుడు సేవలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగించుకోవాలని పలురంగాల ప్రముఖులు కోరారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి డాక్టర్ నోరి దత్తాత్రేయులు దంపతులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, మండలి బుద్ధ ప్రసాద్, సినీ గేయరచయిత జొన్న విత్తుల, ఓలేటి పార్వతీశం, క్యాన్సర్ వైద్యులు జగన్నాథ్, కిన్నెర ఆర్ట్ అధ్యక్షుడు ఆర్వీ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
పుస్తకం చదువుతుంటే కళ్లు చెమర్చాయి
'బాల్యంలో ఎదురైన ఇబ్బందులు, మాతృమూర్తి చేసిన త్యాగాలు, కుటుంబ వాత్సల్యం, బంధుమిత్రుల తోడ్పాటు గురించి నోరి వారి వర్ణన చదువుతుంటే కళ్లు చెమర్చాయి. 1989 నవంబరు 25న అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మాట్లాడుతూ ‘తెలుగు వారికి నేను హీరో కావచ్చు. కానీ వైద్యరంగంలో ఉంటూ, కేన్సర్ మహమ్మారితో పోరాడే జనాల ప్రాణాలను కాపాడే అసలైన హీరో డాక్టర్ నోరి దత్తాత్రేయుడు’ అన్నారు. ఆ మాటలు అక్షర సత్యం. నోరు మంచిదైతే ఊరు మంచిదంటారు. నోరివారి నోరూ, హస్తవాసి రెండూ మంచివే. అందుకే ప్రపంచంలో ఏమూలకేగినా ఆయన వైద్య స్పర్శతో రెండో జీవితాన్ని పొందినవారెందరో తారసపడతారు.'
- సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
ఇదీచూడండి: GULAB TUPAN: ఉత్తరాంధ్రకు గులాబ్ ముప్పు.. ఆరెంజ్ హెచ్చరిక జారీ