కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామ పరిధిలో తమకు చెందిన భూముల్లోని చెట్లు, పండ్ల తోటలు, నిర్మాణాలకు పరిహారం చెల్లించేంత వరకు ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా, రెవెన్యూ అధికారుల జోక్యాన్ని నిలువరించాలని కోరుతూ సీనియర్ నటుడు కృష్ణంరాజు, ఆయన సతీమణి శ్యామలాదేవి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి ఈ వ్యాజ్యంపై విచారణ జరిపారు. పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని గన్నవరం ఎయిర్ పోర్టు డైరెక్టర్, కృష్ణా జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. విచారణను వారం రోజులు వాయిదా వేశారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది వీరారెడ్డి వాదనలు వినిపించారు.
హైకోర్టులో అశ్వనీదత్ పిటిషన్
ఏపీ హైకోర్టులో సినీనిర్మాత అశ్వనీదత్ పిటిషన్ వేశారు. గన్నవరం విమానాశ్రయం విస్తరణకు 39 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. ల్యాండ్ పూలింగ్ చట్టం కింద హామీ ఇచ్చినట్టు రాజధాని అభివృద్ధి జరగలేదని అశ్వనీదత్ అన్నారు. భూసేకరణ చట్టం 2013 ప్రకారం తనకు పరిహారం చెల్లించాలని ఆయన పిటిషన్లో కోరారు.
ఇదీ చదవండి: