కొవిడ్ మహమ్మారి చిన్నారి లేత మనసులను గాయపరుస్తూనే ఉంది. టీనేజ్ పిల్లల్లో కుంగుబాటును ఎక్కువ చేస్తోంది. స్నేహితులతో కలిసేందుకు వీల్లేక.. పిల్లలు ‘స్క్రీన్ టైమ్’కు బానిసలవుతున్నారు. దైనందిన కార్యకలాపాలు దెబ్బతినడంతో పిల్లల్లో క్రమశిక్షణ లోపిస్తోంది. పిల్లల ప్రవర్తనల్లో వచ్చిన మార్పులు రెండు వారాలపాటు అలాగే ఉంటే వారిలో మానసిక సమస్య మొదలైనట్లు గుర్తించాలి. ఈ పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ప్రాథమిక దశలోనే నియంత్రించాలంటే తల్లిదండ్రులు/ కుటుంబసభ్యులు రోజూ కనీసం అరగంట నుంచి గంట సమయాన్ని కేటాయించి వారితో మాట్లాడుతుండాలి. అంటే వీరికి తొలివైద్యులు తల్లిదండ్రులే. అప్పటికీ ప్రవర్తనలో మార్పు రాకుంటే మానసిక వైద్యులను సంప్రదించాలి’ అని బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (నిమ్‌హాన్స్)లోని మానసిక వైద్యనిపుణులు జాన్ విజయ్‌సాగర్ వెల్లడించారు. తిరుపతికి చెందిన విజయసాగర్ నిమ్‌హాన్స్‌లో సైకియాట్రీ (పిల్లలు, కౌమారదశ) విభాగాధిపతిగా వ్యవహరిస్తున్నారు. ‘ఒమిక్రాన్’ ప్రభావంతో మళ్లీ విద్యాసంస్థలకు తాళాలు పడే పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో.. పిల్లలు, టీనేజర్ల ధోరణుల్లో కొవిడ్ కారణంగా వచ్చిన మార్పులు, తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన ‘ఈనాడు’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
కొవిడ్ కారణంగా ఇళ్లలో ఉండే పిల్లల విషయంలో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పాఠశాలల్లో మాదిరిగానే ఇంట్లో కూడా వేళకు ఏం చేయాలో ఓ కాలపట్టిక (టైమ్‌టేబుల్) రూపొందించాలి. టైమ్‌టేబుల్ తయారీ పిల్లలతో కలిసి కూర్చునే చేయాలి. పిల్లలు దాని ప్రకారం వ్యవహరిస్తుంటే.. వారిని ప్రోత్సహించాలి. ఖాళీ సమయాల్లో టీవీలు, ఫోన్లు చూడకుండా ఏం చేయొచ్చో చెబుతూ పిల్లల్లో మార్పు తేవాలి’ అని చెప్పారు.
మీ ఆందోళన పిల్లల దాకా తేవద్దు: కొవిడ్ మహమ్మారిపట్ల ఉన్న భయాందోళనలను తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు పిల్లల వరకు తేవద్దు. అలా చేస్తే వారు మరింత భయపడతారు. పిల్లల ఆందోళనలను కొట్టిపారేయకుండా, కొవిడ్ దుష్పరిణామాల గురించి వారికి వివరిస్తుండాలి. ముఖ్యంగా పిల్లలు బయటకెళ్లి ఆడుకునేందుకు అవకాశం లేక బాధపడుతుంటారు. సమయానికి తినకపోవడం, సరిగ్గా నిద్రపోకపోవడం, ముభావంగా ఉంటుండటం, బయటకు ఎప్పుడు వెళ్తామని పదేపదే అడుగుతుంటే వారు మానసిక వేదనలో ఉన్నారని గుర్తించాలి. ఇదే ధోరణి రెండు వారాలు కొనసాగితే వైద్యులను సంప్రదించాలి.
తప్పకుండా గాడిలో పెట్టాలి!: కొవిడ్ నేపథ్యంలో ఆన్‌లైన్ విద్య రావడంతో పిల్లల దినచర్య గాడి తప్పింది. ఆలస్యంగా నిద్రలేవడం, అన్ని పనులను వాయిదా వేయడం మొదలుపెట్టారు. స్క్రీన్ టైం (మొబైళ్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు చూడటం) పెరిగిపోయింది. ఆన్‌లైన్‌లో బోధన పూర్తయినా ‘స్క్రీన్’తోనే ఉంటున్నారు. ఇలాంటి వారిని పెయింటింగ్, మ్యూజిక్, డ్రాయింగ్, ఇండోర్ క్రీడలపై దృష్టిపెట్టేలా చేయాలి. స్నేహితులతో పరిమితంగా సెల్‌ఫోన్లు, వీడియోకాల్స్ ద్వారా మాట్లాడుకునే అవకాశాన్ని పిల్లలకు కల్పించాలి. ఈ సమయంలో పెద్దల పర్యవేక్షణ తప్పనిసరి.
పిల్లల ప్రవర్తనపైనే 65వేల కాల్స్
* కొవిడ్ దృష్ట్యా 2020 మార్చిలో నిమ్‌హాన్స్ ప్రారంభించిన హెల్ప్‌లైన్‌కు గతేడాది డిసెంబరు 31 వరకు 6లక్షల ఫోన్‌కాల్స్ వచ్చాయి. వీటిలో 64,950 కాల్స్ పిల్లలకు సంబంధించినవే.
* పిల్లలు సరిగా అన్నం తినట్లేదని, వేళకు నిద్రపోవడం లేదని, ఎక్కువ ఆందోళనపడుతున్నారని కుటుంబసభ్యులు చెప్పారు.
* టీనేజర్లలో కొందరు బోర్ కొడుతోందంటూ వింతగా ప్రవర్తిస్తున్నారనీ కాల్స్ వచ్చాయి. వీటిని పరిశీలిస్తే 25% మంది (సుమారు 15 వేల మంది) పిల్లల్లో మానసిక సమస్యలు కొత్తగా వచ్చినట్లు తేలింది. టీనేజ్ పిల్లల్లో 7%-8% మధ్య ఉన్న మానసిక సమస్యలు కొవిడ్ కారణంగా 15%కు పెరిగాయి.
ఇదీ చదవండి: ఊబకాయంతో మరిన్ని జబ్బులు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి