తిరుపతి జిల్లాకు చెందిన యువ కవి, తెలుగు ఉపాధ్యాయుడు పళ్లిపట్టు నాగరాజు, తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన ప్రముఖ కవి డా.పత్తిపాక మోహన్‌లు కేంద్ర సాహిత్య అకాడమీ-2022 యువ, బాల పురస్కారాలకు ఎంపికయ్యారు. నాగరాజు ‘యాలై పూడ్సింది’, మోహన్ ‘బాలల తాతా బాపూజీ’ కవితా సంకలనాలు అకాడమీ అవార్డులు వరించాయి. దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో వెలువడిన కవితా సంపుటాలు, చిట్టికథలు, నవలలు, వ్యాస సంపుటాలు, వ్యంగ్య రచనలు తదితరాలకు అకాడమీ 2022కి బాల, యువ పురస్కారాలను ప్రకటించింది. అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబారా నేతృత్వంలో దిల్లీలో బుధవారం సమావేశమైన సభ్యులు.. 22 భాషలకు సంబంధించి జ్యూరీ ఎంపిక చేసిన రచనలకు పురస్కారాలను ప్రకటించారు. అవార్డులకు ఎంపికైన కవులు/రచయితలకు నవంబరు 14న దిల్లీలో నిర్వహించే వేడుకలో రూ.50,000 చెక్కు, తామ్ర ఫలకం అందజేస్తారు.
‘యాలై పూడుస్తా ఉంది.. ఎంతకాలమీ ఏగులాట... కొన్నాలికలో బెల్లం పూసుకొని.. అంగిట్లో విషం బెట్టుకొని భలే మాట్లాడుతుండారు కదబ్బ.. భలే బెలిపిస్తుండారు కదయ్యా’’.. అంటూ నాయకులను నిలదీసేలా ‘యాలై పూడ్సింది’ కవిత సాగుతుంది. దేశ కాలమాన పరిస్థితులను కళ్లకు కడుతూ 56 కవితలతో ఈ సంకలనాన్ని పళ్లిపట్టు నాగరాజు 2020 డిసెంబరులో వెలువరించారు. అది ఆయన తొలి వచన కవితా సంపుటి.
తెలుగు చదివి.. వెలుగులీని
తిరుపతి జిల్లా సత్యవేడు మండలం రంగనాథపురంలో పేద ఎస్సీ కుటుంబానికి చెందిన పళ్లిపట్టు నాగరాజు తల్లిదండ్రులు భూలక్ష్మి, రాఘవయ్య. కూలీ నాలీ చేస్తూ కుమారుడిని కష్టపడి చదివించారు. ప్రస్తుతం శాంతిపురం మండలం 64 పెద్దూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. రెక్కలు (మినీ కవితలు), మమ్మీ అమ్మ కావాలి, మనసుపొరల్లో వంటి కథలు, పలు కవితలను ఆయన రాశారు. కవిగా ఆయన పలు పురస్కారాలు అందుకున్నారు. 2022 కేంద్ర సాహిత్య యువ పురస్కారానికి అనేక రచనలు పోటీ పడినా జ్యూరీ ఏకగీవ్రంగా ‘యాలై పూడ్సింది’ని ఎంపిక చేసింది. జ్యూరీ సభ్యులుగా ఆచార్య అనుమాండ్ల భూమయ్య, ఆచార్య చల్లపల్లి స్వరూపరాణి, డా.పెన్నా శివరామకృష్ణ వ్యవహరించారు.
బాలల తాతా బాపూజీకి..
‘జోతలివే అందుకొనుము గాంధీతాత
భరతజాతికంతటికి స్ఫూర్తిప్రదాత
సబర్మతి మౌనివి.. సహకార జ్యోతివి
శాంతియుద్ధ వీరునివి, సత్యధర్మ మార్గానివి’’.. అంటూ మహాత్ముడిని వర్ణిస్తూ పత్తిపాక మోహన్ బాలల కోసం గుదిగుచ్చిన కవితా సంకలనమే ‘బాలల తాతా బాపూజీ’. రెండు భాగాలు కలిగిన ఈ పుస్తకంలో తొలి భాగం గాంధీ గేయాలతో, రెండోది గాంధీ గేయ కథతో ఉంటుంది. చిరుప్రాయంలో గాంధీ చూపిన గాంధేయవాదం, ఆయన తత్వం, వ్యక్తిత్వం, జాతీయోద్యమాన్ని మహాత్ముడు ముందుండి నడిపిన తీరును పిల్లల మనసుకు హత్తుకునేలా మోహన్ రచించారు.
ఎన్నెన్నో సంకలనాలకు వన్నెలు..
పిల్లల కోసం మన కవులు, చందమామ రావె, వెన్నముద్దలు తదితర కథల రచనతో పాటు.. పలు రచనలు, సంకలనాలకు మోహన్ సంపాదకత్వం వహించారు. సిరిసిల్లకు చెందిన మోహన్ 1972, జనవరి 5న చందుర్తి మండలం లింగంపేటలో గంగాబాయి, లక్ష్మీరాజం దంపతులకు జన్మించారు. వీరిది చేనేత కుటుంబం. తెలుగు సాహిత్యంలో ఎంఏ, పీహెచ్‌డీ చేశారు. తన రచనలకు పలు పురస్కారాలు, అవార్డులను అందుకున్నారు. ‘బాలల తాతా బాపూజీ’ని జ్యూరీ ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. ఇందులో సభ్యులుగా బెలగం భీమేశ్వరరావు, డాక్టర్ ఎన్.గోపి, చొక్కాపు వెంకటరమణ వ్యవహరించారు.
ఇవీ చదవండి:
సీఎం సభలో సరదా సన్నివేశం, వైఎస్సార్‌పై పాట పాడిన బూచేపల్లి సుబ్బారెడ్డి భార్య
80 ఏళ్ల వయసులో 600 కిమీ బైక్ రైడ్, బామ్మకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే
ఇకపై నేనే సూపర్ స్టార్, షారుక్ అభిప్రాయం తప్పు, రౌడీ హీరో పవర్ పంచ్