KCR meet Stalin: ఇవాళ సాయంత్రం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలుస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రత్యేక విమానంలో కుటుంబసభ్యులతో కలిసి తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లా శ్రీరంగం వెళ్లిన కేసీఆర్ రంగనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రంగనాథస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ మొక్కులు చెల్లించుకున్నారు. వేద మంత్రాలతో రంగనాథ స్వామి ఆలయ పండితులు పూర్ణకుంభంతో ఆహ్వానం పలికారు. సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు గజరాజు నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. గత రెండేళ్లలో రెండోసారి శ్రీరంగ ఆలయానికి వచ్చినట్లు కేసీఆర్ తెలిపారు. స్వామివారిని దర్శించుకుని వెళ్తే ఎంతో శక్తి వచ్చిన అనుభూతి కలుగుతుందని తెలిపారు.
వాటిపైనే ప్రధాన చర్చ
జాతీయ రాజకీయపరమైన అంశాలు, పాలనాపరమైన విషయాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. ప్రస్తుత పరిస్థితులపై చర్చించి భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన అంశాలపై ఇరువురు చర్చించే అవకాశం ఉంది. చెన్నైలోనే ఉన్న రాష్ట్ర మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను కూడా కేసీఆర్ కలవనున్నట్లు సమాచారం.
నేను ఇక్కడకు రావడం ఇది రెండోసారి. ఆలయ నిర్వహణను చాలా బాగా చూస్తున్నారు. భక్తులకు ఇబ్బందుల్లేకుండా ఇంత బాగా ఆలయ నిర్వహణ చేపడుతున్న తమిళనాడు ప్రభుత్వానికి కృతజ్ఞతలు. తమిళనాడు ముఖ్యమంత్రి నాకు మంచి స్నేహితుడు. ఎన్నికల్లో ఆయన అఖండ మెజార్టీతో గెలిచిన తర్వాత తొలిసారి ఇక్కడకు వచ్చాను. మంగళవారం సాయంత్రం ఆయన సమయం ఇవ్వడం వల్ల కలవబోతున్నాను. ఆలయంలో ఎలాంటి రాజకీయాలు మాట్లాడను. చెన్నైలో అన్ని విషయాలు చెబుతాను. -కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి.
ఇవీ చూడండి: