ప్రతి మున్సిపాలిటీలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఉండాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలతో నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నగరాలు, పురపాలక సంస్థల్లో మౌలిక వసతుల కల్పన ప్రణాళికలపై ఈ సమావేశంలో చర్చించారు. తాగునీరు, భూగర్భ డ్రైనేజి, వ్యర్థాల తొలగింపు, మురుగునీటి శుద్ధిపై సమాలోచనలు చేశారు. ప్రస్తుత ప్రాజెక్టులు, చేపట్టాల్సిన కొత్త పనులపై సీఎం ఆరా తీశారు. మున్సిపల్ స్కూళ్లను అభివృద్ధి చేయటంపై ఈ సమీక్షలో సీఎం ప్రస్తావించారు. మురుగునీటి శుద్ధి, ఘనవ్యర్థాల నిర్వహణ ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రతి ఇంటికీ రేషన్ కార్డు, పింఛను, ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని చెప్పారు. వీటితో పాటు తాడేపల్లి, మంగళగిరిని మోడల్ మున్సిపాల్టీలుగా తయారు చేయటంపై సమీక్షలో చర్చించారు. తాడేపల్లిలో వంద పడకల ఆస్పత్రికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు.
కరకట్ట ఇళ్లపై చర్చ
కృష్ణానది కట్టపైన, కరకట్ట లోపల, కాల్వ గట్లపై ఉన్న ఇళ్లపై సమీక్షలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఆయా ప్రాంతాల్లో ఉన్న వారికి కనీసం 2 సెంట్లలో ఇళ్లు
వారు కోరుకున్నచోట నిర్మించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఉగాది నాటికి పట్టాలిచ్చి, మంచి డిజైన్లతో ఉచితంగా ఇళ్లు కట్టివ్వాలని అన్నారు. ప్రభుత్వ భూముల్లో ఇళ్లు కట్టి సుదీర్ఘకాలంగా ఉంటున్నవారికి పట్టాలివ్వాలని చెప్పారు. ఈ సమీక్షలో మంత్రి బొత్స, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.