చేరికను ఊహించారు కానీ...
వైకాపా నేతలు, ప్రభుత్వ ఉద్యోగుల వేధింపుల నుంచి తన అనుచరులను కాపాడుకునేందుకు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వంశీ ప్రకటించటం రాజకీయంగా చర్చకు దారి తీసింది. ఇటీవల మంత్రులు కొడాలి నాని, పేర్ని నానితో కలిసి వంశీ.. తాడేపల్లిలోని సీఎం నివాసంలో జగన్‌ను కలిశారు. ఈ నేపథ్యంలో వంశీ వైకాపాలో చేరుతున్నారని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. వైకాపా శ్రేణులు చెప్పినట్టుగానే వంశీ తెదేపాకు రాజీనామా చేశారు కానీ.. వైకాపా నేతలతో పాటు, ప్రభుత్వ ఉద్యోగులపై ఆరోపణలు చేయడం కొత్త చర్చకు తెరలేపింది. వంశీకి వైకాపాలో చేరే ఉద్దేశం ఉంటే వైకాపా నేతలు, ప్రభుత్వ ఉద్యోగులపై ఎందుకు ఆరోపణలు చేస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
వంశీనీ పార్టీలోకి చేర్చుకోవద్దు..!
వంశీ వైకాపాలోకి రావడాన్ని గన్నవరం నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జి యార్లగడ్డ వెంకట్రావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వైకాపా శ్రేణులు కూడా వంశీ రాకపై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వంశీ తన నిర్ణయాన్ని మార్చుకున్నారా? లేక వైకాపాలోనే చేరుతారా? కమలంవైపు చూస్తారా? అనేది ప్రశ్నగా మిగిలింది. 2019 అసెంబ్లీ ఎన్నికలకు రెండు రోజుల ముందు 12వేల నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చి ఓటర్లను ప్రలోభ పెట్టడంతో పాటు... ప్రసాదంపాడులో రిగ్గింగ్ చేసి 200 ఓట్లతో గెలుపొందారంటూ వంశీపై వెంకట్రావు ఇటీవల ఆరోపణలు చేశారు. వంశీ గతంలో తమ కార్యకర్తలపై అనేక కేసులు పెట్టారని, తెదేపా పాలనలో గన్నవరం ప్రజలు, వైకాపా శ్రేణులు అనేక ఇబ్బందులు పడ్డారని యార్లగడ్డ ఆరోపించారు. ఈ నేపథ్యంలో వంశీ వైకాపాలో చేరినా యార్లగడ్డ వర్గంతో కలిసి పని చేయగలరా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.
లేఖపై స్పందించిన చంద్రబాబు...
వ్యక్తిగతంగా, పార్టీపరంగా పూర్తి అండగా ఉంటానని చంద్రబాబు భరోసా ఇచ్చినా.. వంశీ తన నిర్ణయాన్ని మార్చుకోకపోవటంతో తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయనేది చర్చనీయాంశమైంది. తాజా పరిణామాలతో ఈ వ్యవహరం ఏ క్షణం ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. తన రాజకీయ భవితవ్యంపై వంశీ స్పష్టమైన ప్రకటన చేస్తేనే ఈ గందరగోళానికి తెరపడే అవకాశముంది. చంద్రబాబు.. రేపు నిర్వహించే జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారోనని నేతలూ ఎదురు చూస్తున్నారు. గన్నవరానికి కొత్త బాధ్యుడ్ని ప్రకటిస్తే.... పలు సమీకరణాల వల్ల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉండవచ్చని అంచనా. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ది తొలుత గన్నవరం నియోజకవర్గమే. ఆయన సతీమణి, మాజీ జెడ్పీ ఛైర్పర్సన్ అనురాధ లేదా దేవినేని అవినాష్, బోడె ప్రసాద్ పేర్లు వినిపిస్తున్నాయి. బోడెప్రసాద్ , దేవినేని అవినాష్‌లో ఒకరికి గన్నవరం... మరొకరికి పెనమలూరు సర్దుబాటు చేసే అవకాశాలున్నాయి. అధినేత చంద్రబాబు వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించకపోయినప్పటికీ రానున్న రోజుల్లో కొందరికి బాధ్యతలు అప్పగించవచ్చని తెలుస్తోంది.
ఇదీ చదవండి : రాజకీయాల నుంచి వైదొలుగుతున్నా: వల్లభనేని వంశీ