దేశ ప్రజలందరికీ తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వైరస్ ప్రబలుతున్న కారణంగా సీతారాముల కల్యాణాన్ని నిరాడంబరంగా జరుపుకోవాలని చంద్రబాబు సూచించారు. ఇళ్లల్లోనే కుటుంబసభ్యులతో శ్రీరామ నవమిని భక్తిశ్రద్ధలతో ప్రజలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. అయోధ్యలో రాముడు పట్టాభిషిక్తుడైన చైత్ర శుద్ధ నవమి నాడే సీతారాముల కల్యాణం జరగడం ఆనందదాయకమన్నారు. సీతారాముల కల్యాణం సందర్భంగా బెల్లం, మిరియాలు కలిపి తయారు చేసే పానకం చాలా మందికి ప్రీతిపాత్రమైనదే కాదు.. ఆరోగ్యానికి మంచిదని పేర్కొన్నారు. సామూహిక వేడుకలకు విరామం ప్రకటించాలని సూచించారు. పండుగవేళ ఇళ్లకే పరిమితమై శ్రీరాముని దివ్య చరిత్రను మననం చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. మన ఆరోగ్యం, కుటుంబ ఆరోగ్యంతోపాటు సమాజ ఆరోగ్యం కాపాడుకుందామని పిలుపునిచ్చారు.
లోకేశ్ శుభాకాంక్షలు..
ప్రజలందరికీ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడంటే ఆదర్శం అన్న అయన ప్రజాస్వామ్య దేశంలో ప్రజాభిప్రాయానికి విలువనివ్వకుండా నియంతల్లా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్న పాలకులను నేడు చూస్తున్నామని పేర్కొన్నారు. అలాంటిది ఆనాడే ప్రజల అభిప్రాయాలకు శ్రీరాముడు విలువ ఇచ్చాడని వెల్లడించారు. అందుకే రామరాజ్యంలో ప్రజలందరూ సుఖశాంతులతో జీవించారన్నారు. వీధుల్లోకి రాకుండా ఇంట్లోనే ఆ సీతారాములను పూజించి వారి అనుగ్రహాన్ని పొందాలని లోకేశ్ ప్రజలకు సూచించారు.
ఇదీ చదవండి: