తెదేపా రాష్ట్ర కార్యాలయంలో అధినేత చంద్రబాబు పార్టీ ముఖ్యనేతలతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై హైకోర్టు తీర్పుతో వైకాపా నేతలు ఇప్పడు ఏం ముఖం పెట్టుకుంటారని చంద్రబాబు నిలదీశారు. ఇష్టానుసారంగా వ్యవహరించడానికి రాష్ట్రం వారి సొంత జాగీరు కాదని హెచ్చరించారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నా, ఉల్లంఘనలకు పాల్పడినా న్యాయవ్యవస్థ చూస్తూ ఊరుకోదనే విషయాన్ని గ్రహించాలని హితవుపలికారు. తెదేపా హయాంలో జారీ చేసిన ఏఉత్తర్వులు న్యాయస్థానం కొట్టివేయలేదని గుర్తు చేశారు. అధికారం చేపట్టిన నాలుగు నెల్లలోనే ప్రభుత్వం ఉత్తర్వును కోర్టు రద్దు చేయడం వైకాపా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిదర్శనమని మండిపడ్డారు.
ఇప్పుడేం సమాధానం చెబుతారు....
పీపీఏలను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదన్నది తాజా పరిణామాలతో స్పష్టమైందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పీపీఏలపై వైకాపా నేతలు తలాతోక లేకుండా ఆరోపణలు చేశారని చంద్రబాబుతో అన్నారు. సీఎం ముఖ్య సలహాదారు అజేం కల్లం, అదనపు ప్రధాన కార్యదర్శి పీవీ.రమేష్, ఇందనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ తదితరులు మీడియా సమావేశంలో ఎన్నో చెప్పారని, ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. పీపీఏలపై కేంద్ర ఇంధన శాఖ మంత్రి, కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి లేఖలు రాసిన ప్రధాని కార్యాలయం, విదేశీ ఎంబసీలు హెచ్చరించిన వాటిని బుట్టదాఖలు చేశారని దుయ్యబట్టారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా పట్టించుకోకుండ ముందుకెళ్లి ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగేలా చూశారని ఆక్షేపించారు
నాడు ఆరోపించారు...నేడు కట్టబెట్టారు...
పట్టిసీమలో మెఘా సంస్థకు నాడు 350కోట్లు దోచిపెట్టామని వైకాపా విమర్శలు చేసిన అంశం సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. చంద్రబాబు బినామీ సంస్థ అని నాడు ఆరోపించి ఇప్పుడు ఆసంస్థకు పోలవరం టెండరు ఎందుకు రిజర్వు చేశారని అధినేత నిలదీశారు. పోలవరం పనుల్లో రాజకీయ దురద్దేశంతోనే రాష్ట్రానికి వేలకోట్లు నష్టం చేశారని దుయ్యబట్టారు.
లాభం కన్నా పది రెట్లు నష్టం....
మెఘా సంస్థ నాడు పోలవరం పనుల కోసం టెండర్ ఎందుకు ఎక్కువ దాఖలు చేసి నేడు తక్కువ ఎందుకు దాఖలు చేసిందని సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పనుల్లో తక్కువకు టెండరు వేసి నాసిరకం పనులు చేయడానికా లేదా వేరే విధంగా లబ్ది చేకూర్చుకోవటానికా అని చంద్రబాబు నిలదీశారు. రివర్స్ టెండర్ వల్ల రాష్ట్రానికి లాభం కన్న పదిరెట్లు నష్టం జరుగుతోందని నేతలు... అధినేత చంద్రబాబు వద్ద అభిప్రాయపడ్డారు.
ఇవీ చూడండి-పీపీఏల పున:సమీక్షపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు జీఓ కొట్టివేత