అసెంబ్లీ సమావేశాలు కవర్ చేసేందుకు అన్ని మీడియాలను అనుమతించాలని.... సభాపతి తమ్మినేని సీతారాంకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ప్రజాస్వామ్యంలో ప్రధాన భాగస్వామి అయిన మీడియాను నిషేధించడం అప్రజాస్వామికమని...లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం గతంలో జీవో నెంబర్ 2430 ద్వారా మీడియా హక్కుల్ని హరించిందని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే శిక్షించాలని ఉత్తర్వులు ఇచ్చిందని ఆరోపించారు. ఈ విషయాన్ని జాతీయ మీడియా కూడా తీవ్రంగా వ్యతిరేకించిందన్న విషయాన్ని గుర్తు చేశారు.
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సైతం... ఆ జీవోను తప్పుబట్టిందని లేఖలో ప్రస్తావించారు. ఇప్పుడు చట్టసభల్లోకి మీడియాను నిషేధించడం అంతకంటే దారుణమైన చర్యగా భావిస్తున్నామన్నారు. పార్లమెంటు సమావేశాల్లోనే మీడియాకు లేని నిషేధాన్ని... ఇక్కడ ఎందుకు విధిస్తున్నారని ప్రశ్నించారు. చట్ట సభల్లోని అంశాలు ప్రజలకు తెలియకుండా మీడియాను నిషేధించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. సభా కార్యక్రమాలను యథాతథంగా ప్రజలకు తెలియజేసే అవకాశం ఇవ్వడమే నిజమైన ప్రజాస్వామ్యమని సభాపతికి రాసిన లేఖలో చంద్రబాబు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
పోలవరం నిధుల కోసం కేంద్రాన్ని ఎందుకు నిలదీయట్లేదు?: ఉండవల్లి