రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ప్రస్తుత సంఘటనలు బ్రిటీష్ రాజ్, నియంతృత్వ అధికారాన్ని గుర్తుకు తెస్తున్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కుప్పంలో అర్ధరాత్రి అమర్నాథ్ రెడ్డి, పులవర్తి నానిలను అరెస్టు చేయటాన్ని ఖండిస్తూ డీజీపీ, ఎస్ఈసీలకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. కుప్పంలో తెలుగుదేశం పార్టీ ప్రచారాన్ని అడ్డుకునేందుకు పోలీసుల అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఓ ప్రహసనంగా మార్చారని చంద్రబాబు దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునేందుకు అధికార వైకాపాతో కొందరు అధికారులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. తెదేపా అభ్యర్థుల నామినేషన్లను అక్రమంగా తిరస్కరించారని ఆక్షేపించారు. నకిలీ సంతకాల ద్వారా వారి నామినేషన్లను ఉపసంహరించుకున్నారని పేర్కొన్నారు. పోలీసులు కూడా వైకాపాతో కుమ్మకై తెదేపా నేతలు ప్రచారం చేయకుండా చూస్తున్నారని అన్నారు. తప్పుడు ఫిర్యాదులుపై అర్ధరాత్రి అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారని మండిపడ్డారు. అమర్నాథ్ రెడ్డి, పులవర్తి నానిల అర్ధరాత్రి అరెస్టులు.. ప్రచారాన్ని అడ్డుకునే కుట్రలో భాగమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజా ఘటనలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని విమర్శించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెదేపా నేతల అరెస్ట్.. ఎందుకంటే..
మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, చిత్తూరు పార్లమెంట్ తెలుగుదేశం అధ్యక్షుడు పులివర్తి నానిని పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. కుప్పంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో బస చేసిన వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో అక్రమాలంటూ సోమవారం రాత్రి తెలుగుదేశం నాయకులు పురపాలక కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. కార్యాలయంపై దాడి చేశారంటూ 19 మంది నాయకులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అందులో భాగంగానే అమర్‌నాథ్‌రెడ్డి, పులివర్తి నానిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి:
తెదేపా నేతలు అమర్‌నాథ్ రెడ్డి, పులివర్తి నాని అరెస్టు