కరోనాపై పోరాడుతున్న క్షేత్రస్థాయి సిబ్బందికి తక్షణమే రక్షణ పరికరాలు అందించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్నీకి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ట్రూనాట్ కిట్ల సాయంతో కరోనా నిర్ధరణ పరీక్షలను మరింత వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందడంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. ఇంకా 16 వేల పరీక్షల ఫలితాలు పెండింగ్‌లో ఉండటం సబబు కాదన్నారు. రాష్ట్రంలో సరైన టెస్టింగ్ ల్యాబ్‌లు లేకపోవడం వల్లే ఫలితాలు ఆలస్యం అవుతున్నాయని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల మాదిరి ప్రైవేట్ ల్యాబ్ల సహకారం తీసుకునే వెసులుబాటు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) ట్రూనాట్ పరికరాలు వినియోగానికి ఆమోదం తెలిపినా ఇంతవరకూ ఆ దిశగా చర్యలు తీసుకోలేదని చంద్రబాబు మండిపడ్డారు. వైరస్ నియంత్రణకు క్షేత్రస్థాయిలో పోరాడుతున్న వారి పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని లేఖలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి :