పంచాయతీ ఎన్నికల ఫలితాలతో వైకాపా పతనానికి నాంది మొదలైందని చంద్రబాబు స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో వైకాపా పరిస్థితి మరింత దిగజారనుందని విమర్శించారు. 20 నెలల్లో రాజ్యాంగ వ్యవస్థల్ని విధ్వంసం చేశారని మండిపడ్డారు. 90 శాతం పంచాయతీలు గెలవకపోతే మంత్రుల్ని తొలగిస్తామని బెదిరించటంతో పాటు మంత్రి పదవి కావాలంటే ఏం చేసైనా గెలవమని లక్ష్యాలు నిర్దేశించారని ఆరోపించారు. వైకాపా దుర్మార్గాలను ఎదిరించిన ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడారన్నారు. తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో 38.74శాతం తెదేపా బలపరిచిన అభ్యర్థులు గెలిచారని వెల్లడించారు.
బలవంతపు ఏకగ్రీవాలు
తొలిదశ లో 2723పంచాయతీ ఎన్నికలు జరిగ్గా వాటిలో 1023 తెదేపా బలపరిచిన అభ్యర్థులు గెలిచారని చంద్రబాబు వెల్లడించారు. పొత్తుతో మరో 32 కలిపి మొత్తం 1055 తెదేపా బలపరిచిన అభ్యర్థులు గెలిచారని తెలిపారు. తొలిదశ ఎన్నికల్లో 94శాతం గెలిచామని ఓ మంత్రి గాలికబుర్లు చెప్పారని చంద్రబాబు దుయ్యబట్టారు. గెలుపోటములు సహజమని జ్ఞానోదయం అయినట్లుగా విజయసాయి ట్వీట్ చేశారన్నారు. మంత్రులు పెద్దిరెడ్డి, బాలినేని పంచాయతీ ఎన్నికల్ని రణరంగంగా మార్చారన్నారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. పుంగనూరు, తంబళ్లపల్లె, మాచర్లలో బలవంతపు ఏకగ్రీవాలు చేశారని విమర్శించారు.
కోర్టులో కేసులెస్తాం
ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం విఫలం అయ్యిందని చంద్రబాబు విమర్శించారు. పుంగనూరు, మాచర్లపై ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోలేదన్న చంద్రబాబు.. జరిగిన పరిణామాలపై ఎన్నికల కమిషన్ కూడా సమీక్షించుకోవాలన్నారు. బరితెగించిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తెదేపా గెలిస్తే, వైకాపా వాళ్ళు గెలిచినట్లు ప్రకటిస్తారా అని ప్రశ్నించారు. మాచర్ల, పుంగనూరు నియోజకవర్గాల్లో కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహిస్తే తమ సత్తా చాటుతామన్నారు. పెద్దిరెడ్డి వ్యవహారంపై కోర్టులో కేసు వేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అధికారుల్ని బెదిరించిన అంశంతోపాటు వివిధ ఘటనలపై విడివిడిగా కేసులేస్తున్నామని తెలిపారు.
అచ్చెన్నాయుడిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారు. అంతేకాకుండా అక్రమ కేసు బనాయించారు. వైకాపా ఎమ్మెల్యేలు మాట్లాడితే మాత్రం పట్టించుకోరు. పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదు. ఎస్‌ఈసీ చెబితే వినొద్దని మంత్రి పెద్దిరెడ్డి చెబుతారా? అఖిల భారత సర్వీసు అధికారులను బెదిరించడమేంటి..? ఏ తప్పూ చేయని కొల్లు రవీంద్రపై కేసు పెడాతారా..? -చంద్రబాబు, తెదేపా అధినేత
ఏ ఒక్కరినీ వదిలిపెట్టం
మొత్తం 174 అక్రమ కేసులు పెడితే... 414 బలవంతంగా నామినేషన్లు ఉపసంహరణలు చేయించారని చంద్రబాబు మండిపడ్డారు. 33 చోట్ల ఎన్నికల కోడ్ ఉల్లంఘిచారని.. ఇద్దరిని హత్య చేశారన్నారు. 23 మందిపై హత్యాయత్నాలు చేశారని తెదేపా అధినేత ధ్వజమెత్తారు. 61 దాడులు, 42 కిడ్నాపులు, 92 చోట్ల బెదిరింపులకు పాల్పడ్డారని, తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు. ప్రతి ఒక్కరినీ న్యాయస్థానం బోనులో నిలబెడతామన్నారు. ఎక్కడికక్కడ ప్రజాస్వామ్యం ఖూనీ చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ పలు వీడియోలను ప్రదర్శించారు.
2,3,4దశల ఎన్నికల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండి చైతన్యం కనబరచాలని చంద్రబాబు కోరారు. ప్రజలంతా ఒక్కటై న్యాయం కోసం, హక్కుల కోసం పోరాడదామని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి
మీడియాతో మాట్లాడేందుకు మంత్రి పెద్దిరెడ్డికి హైకోర్టు అనుమతి