రివర్స్ టెండరింగ్ (reverse tendering) పేరుతో రాష్ట్రంలోని ప్రాజెక్టుల పనులన్నీ ఆలస్యమవుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు(chandrababu) ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయో అయోమయంగా ఉందని చెప్పారు. డిజిటల్ మహానాడు(digital mahanadu 2021) రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా చంద్రబాబు మాట్లాడారు.
తమ హయాంలో పులివెందులకు నీళ్లు ఇచ్చి చీనీ చెట్లను కాపాడామని.. రాయలసీమలో కరవు ఉండకూడదని చర్యలు చేపట్టినట్లు గుర్తు చేశారు. ఆ ప్రాంతంలో 8 లక్షల వ్యవసాయ కుంటలు తవ్వామన్నారు. వైకాపా నేతలు శాసనసభ(ap assembly) సాక్షిగా అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. తమ హయాంలో రైతులకు ఇబ్బంది లేకుండా పంటల బీమా అమలు చేశామని చెప్పారు. తుపాన్ల సమయంలో పాడైన ధాన్యం కొనుగోలు చేశామని.. ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు.
'తెదేపా హయాంలో 24 ప్రాజెక్టులు పూర్తి చేశాం. 32 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాం. ఏడాదిలో పట్టిసీమ పూర్తి చేసి నదుల అనుసంధానికి శ్రీకారం చుట్టాం. ప్రాజెక్టులకు జగన్ రూ.వెయ్యి కోట్లు కూడా ఖర్చు చేయలేదు. రైతు భరోసా పేరుతో రైతులను దగా చేశారు. రైతుల ఆత్మహత్యలు పెరిగాయి.. విత్తనాల సరఫరా ఆగింది' - తెదేపా అధినేత చంద్రబాబు
కేసులకు భయపడవద్దు..
ప్రభుత్వ అరాచకాలతో తెదేపా కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బెయిల్ రాకూడదని 7 ఏళ్లకు పైబడి శిక్ష పడే కేసులు పెట్టారన్నారు. కేసులకు భయపడితే భవిష్యత్తులో మరింత ఇబ్బంది పడతామని హెచ్చరించారు. తప్పుడు కేసులు పెడితే మనం కూడా ఎదురు కేసులు పెడదామని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి