ముఖ్యమంత్రి జగన్ పై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్థిక ఉగ్రవాది సీఎం అయితే... ప్రజల్ని ఏ విధంగా శాసిస్తున్నాడో చూస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో నుంచి ప్రజలు బయటపడాలంటే రాజకీయ చైతన్యం ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడిన చంద్రబాబు... విశాఖలో పెచ్చుమీరుతున్న విజయసాయిరెడ్డి అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. విశాఖలోనే మకాం వేసి దోచుకుంటూ, ప్రశాంతమైన నగరాన్ని అరాచకానికి, అకృత్యాలకు, దోపిడీలకు చిరునామాగా మార్చారని ఆరోపించారు. కొంతమంది అధికారులు అధికార పార్టీకి అండగా నిలిచి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సంఘం వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్లు వేసిన వారిని వైకాపా నేతలు ప్రలోభాలకు గురిచేసి, భయపెడుతున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రజలిచ్చిన తీర్పును గౌరవించకుండా వైకాపా నేతలు ఆటవికంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పడాన్ని జీర్ణించుకోలేక తెదేపా మద్ధతుదారులపై దౌర్జన్యాలు, విధ్వంసాలకు దిగుతున్నారని విమర్శించారు. నగరపాలక, మున్సిపల్ ఎన్నికలకు సమాయత్తం కావాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఇదీ చదవండి