సీఎం జగన్పై తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా నేతలపై జగన్రెడ్డి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి చర్యలతో ప్రజాస్వామ్యం పతనం అవుతోందన్నారు. వికృత రాజకీయాలు చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. వైకాపా నేతల అవినీతి, అక్రమాలను సాక్ష్యాధారాలతో సహా నిరూపించిన తెదేపా నేతలపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. సంబంధం లేని అంశంలో అక్రమంగా కేసు నమోదు చేసి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని దుయ్యబట్టారు. అక్రమ కేసులతో, రాజారెడ్డి రాజ్యాంగంతో ప్రతిపక్షాల గొంతు నొక్కలేవని వ్యాఖ్యానించారు. అధికారం శాశ్వతం కాదు.. ఇంతకింత అనుభవించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయనే విషయాన్ని జగన్ రెడ్డి గుర్తుంచుకోవాలని హితవు పలికారు. వెంటనే రామకృష్ణారెడ్డిపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేసి బేషరతుగా ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి 'పింగళి వెంకయ్యకు భారత రత్న ఇవ్వాలి'