కట్టడం చేతగాని వాళ్లకు కూల్చే హక్కులేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రానికి, ముఖ్యంగా ఉత్తరాంధ్రకు గర్వకారణమైన గీతం సంస్థలపై రాజకీయ కక్షసాధింపు మరో తుగ్లక్ చర్యని మండిపడ్డారు. కోర్టులో ఉన్న వివాదంపై, ఎటువంటి ఆదేశాలు రాకముందే యూనివర్సిటీ కట్టడాలను కూల్చేయడం వైకాపా కక్ష సాధింపు చర్యేనని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉగ్రవాదం అంటూ ఇప్పటికే విద్యా, వైద్య, పారిశ్రామిక సంస్థలు ఆంధ్రప్రదేశ్‌కు రావాలంటేనే భయపడే దుస్థితి ఏర్పడిందన్నారు. ఇక్కడి హింసా విధ్వంసాలను చూసి... బిహార్ ఆఫ్ సౌత్ ఇండియా అనుకుంటూ అనేక కంపెనీలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఆక్షేపించారు.
కక్ష సాధింపుకు ప్రత్యక్ష సాక్ష్యం
ఇప్పటికే చదువు, ఉపాధి, ఆరోగ్య చికిత్సల కోసం ఏపీ ప్రజలు పక్కరాష్ట్రాలకు పోతున్నారన్న చంద్రబాబు... విద్యా, సామాజికసేవల్లో గీతం చేయూత అందిస్తూ ఎంతోమంది విద్యార్ధుల చదువులు, యువత ఉపాధికి, రోగుల వైద్యానికి గీతం సంస్థ దోహదపడుతోందన్నారు. అలాంటి విద్యాసంస్థల కూల్చివేతలను ఖండిస్తున్నట్లు ప్రకటించారు. ప్రతిష్టాత్మక విద్యాసంస్థపై ఇలా విధ్వంసాలకు పాల్పడటం రాష్ట్ర ప్రగతికి చేటుదాయకమని ఆక్షేపించారు. ఇటీవల మాజీమేయర్ సబ్బంహరి ఇంటిపై విధ్వంసం చేసే తాజాగా గీతం వర్సిటీలోనూ విధ్వంసం చేయటం కక్ష సాధింపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యమని ఆగ్రహం వ్యక్తం చేసారు. వ్యక్తులు, పార్టీపై అక్కసుతో చేస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్యలను గర్హిస్తున్నట్లు తెలిపారు. కరోనా కాలంలో సామాజిక బాధ్యతగా కోట్ల రూపాయల నష్టాన్ని భరించి 2,590 మంది కొవిడ్ రోగులకు గీతం సంస్థ చికిత్స అందించిందని గుర్తు చేశారు. అలాంటి ఆదర్శవంతమైన సరస్వతీ నిలయాన్ని అర్థరాత్రి 200 మందితో వెళ్ళి కూల్చడం దారుణమన్నారు చంద్రబాబు.
ఇదీ చదవండి: