తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్ట్‌పై పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీటెక్ రవి అరెస్ట్ ముఖ్యమంత్రి జగన్ కక్షసాధింపు చర్యలో భాగమేనని ధ్వజమెత్తారు. నెలరోజుల కిందట ఎస్సీ మహిళపై అత్యాచారానికి పాల్పడిన వాళ్లపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. దానిని నిలదీసిన వాళ్లపై అక్రమ కేసులు బనాయించడాన్ని తప్పుబట్టారు. ఈ దుశ్చర్యల వల్లే నేరగాళ్లు ఇంకా చెలరేగి పోతున్నారని విమర్శించారు. ఎస్సీలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు పెట్టడం మరో దుర్మార్గ చర్యని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో చట్టబద్ద పాలన(రూల్ ఆఫ్ లా) లేదనడానికి ఇదే తార్కాణమన్నారు. 'ఛలో పులివెందుల' కార్యక్రమం నిర్వహించారన్న అక్కసుతోనే తెదేపా నాయకులపై తప్పుడు కేసులు పెట్టి అక్రమ నిర్బంధాలు చేస్తున్నారని ఆరోపించారు. బాధితులకు అండగా ఉండటం తెలుగుదేశం నాయకుల చేసిన నేరమా? అని ప్రశ్నించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరడమే అపరాధమైందని ధ్వజమెత్తారు. ఎస్సీలపై దమనకాండకు పాల్పడేవాళ్లపై చర్యలు తీసుకోరా అని నిలదీశారు. వైకాపా ప్రభుత్వ దమనకాండను అన్నివర్గాల ప్రజలు నిరసించాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: