కడప విమానాశ్రయం నుంచి ఇతర ప్రాంతాలకు విమాన సర్వీసుల్ని పునరుద్ధరించాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు కోరారు. ఈ సేవల్ని నిలిపేయడంతో పెట్టుబడిదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆదివారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ‘అందరికీ విమానయానం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో తెదేపా ప్రభుత్వ హయాంలో ఉడాన్ పథకం కింద టైర్-2, 3 నగరాల మధ్య విమాన సర్వీసుల్ని ఏర్పాటు చేశాం. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, తిరుపతి నుంచి కడపకు నేరుగా విమానాలు నడిచిన సంగతి మీకు తెలిసిందే. గతంలో కడప నుంచి హైదరాబాద్, విజయవాడకు విమానంలో ప్రయాణించాలంటే తిరుపతి, చెన్నై, బెంగళూరు వెళ్లాల్సి వచ్చేది. దీంతో సమయం వృథా కావడమే కాకుండా.. ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా ఉండేది. దీన్ని దృష్టిలో ఉంచుకుని 2018లో ఉడాన్ పథకం కింద విమాన సేవలను ప్రవేశపెట్టాం. కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాల ప్రజలు ఆ సేవలను వినియోగించుకున్నారు. ప్రస్తుతం కడప నుంచి ఇతర ప్రాంతాలకు విమాన సేవల్ని నిలిపేయడంతో.. ప్రయాణం కష్టంగా మారింది’ అని లేఖలో వివరించారు.
12 నుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన
తెదేపా అధినేత చంద్రబాబు ఈ నెల 12 నుంచి 14 వరకు చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో బెంగళూరు చేరుకుని.. రోడ్డు మార్గాన కుప్పంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి వెళ్తారు. సాయంత్రం 3 గంటలకు కుప్పం బస్టాండ్ కూడలిలో జరిగే బహిరంగ సభలో మాట్లాడతారు. సాయంత్రం 5.30 గంటలకు పార్టీ నేతల సమావేశంలో పాల్గొని.. రాత్రికి కుప్పంలోనే బస చేస్తారు. బుధ, గురువారాల్లో రోడ్‌షోలలో పాల్గొని, కేసీ ఆసుపత్రిని సందర్శిస్తారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశంలో పాల్గొంటారు. గురువారం సాయంత్రం 7 గంటలకు బెంగళూరుకు చేరుకుని విమానంలో హైదరాబాద్‌కు వెళ్తారని తెదేపా ఒక ప్రకటనలో తెలిపింది.
ఇదీ చదవండి: