రైతులు, పేదల పట్ల వైకాపా నిర్దయగా వ్యవహరిస్తోందని.. తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, ముఖ్య నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజల ఓట్ల కోసం భూమి మీద తిరిగి.. వారు ఆపదలో ఉంటే ఆకాశంలో తిరుగుతున్నారని సీఎం జగన్ని విమర్శించారు. భారీవర్షాల ధాటికి వేలకోట్ల రూపాయల నష్టం జరిగితే.. కేవలం రూ. 200 కోట్లను మంజూరు చేశారని మండిపడ్డారు. అవీ రైతుల ఖాతాల్లో జమ చేయకుండా వేధిస్తున్నారన్నారు.
రేపు నిలదీతే...
నివర్ తుపాను వల్ల కనీవినీ ఎరుగని నష్టం జరిగిందని చంద్రబాబు తెలిపారు. 114 నియోజకవర్గాల్లోని 12లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయన్నారు. ప్రతి నియోజకవర్గంలో నివర్ తుపాను నష్టంపై నివేదికలని.. రేపటి అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తెస్తామన్నారు. పరిహారం తక్షణమే చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామని స్పష్టం చేశారు. నష్ట పరిహారం వెంటనే ఇస్తే.. రబీలో పెట్టుబడులకు ఆసరాగా ఉంటుందని సూచించారు. నష్టపోయిన ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
రైతులను మోసం చేశారు...
గాలిలో తిరగడం, గాలి కబుర్లు చెప్పడం తప్ప సీఎం చేసింది శూన్యమని తెదేపా అధినేత దుయ్యబట్టారు. విపత్తు రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేశారని మండిపడ్డారు. పంటల బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని నమ్మించి.. వారు కట్టకుండా, రైతులను కట్టుకోనివ్వకుండా చెడగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడు విపత్తుల్లో నష్టపరిహారం చెల్లించలేదని.. ఇన్ పుట్ సబ్సిడీ, పంటల బీమా ఎగ్గొట్టారని ఆవేదన వ్యక్తంచేశారు. మైక్రో ఇరిగేషన్ సబ్సిడీకి మంగళం పాడి.. రైతులంతా రోడ్లెక్కి ఆందోళనలు చేసే పరిస్థితి కల్పించారని దుయ్యబట్టారు. కష్టాల్లోని బాధితులను ఆదుకునే పాలకులను చూశామని.. పేదలపై దాడులు చేసి ఆనందించే వారిని ఇప్పుడే చూస్తున్నమన్నారు.
ఇదీ చదవండి: