అమరావతి రైతులు ఏకాకులు కాదని.. వారికి ఎప్పుడూ అండగా ఉంటానని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. అమరావతి రైతుల పోరాటం వృథా కాదన్నారు. అమరావతి కోసం రైతులు చేస్తున్న పోరాటం సిద్ధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మందడంలో రైతుల పోరాటానికి చంద్రబాబు మద్దతు తెలిపారు. అసెంబ్లీ నుంచి వెళ్తూ మందడం దీక్షా శిబిరం వద్ద రైతులను పరామర్శించారు.
రాజధానిని.. అమరావతి నుంచి తరలించడం ఎవరితరం కాదని చంద్రబాబు అన్నారు. న్యాయమే విజయం సాధిస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు. వైకాపా ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. కొంతమంది పోలీసులు రైతులను కావాలని ఇబ్బందిపెడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. రాజధానిని అమరావతి నుంచి తరలిపోకుండా రైతులు చేస్తున్న పోరాటం భవిష్యత్తు పోరాటాలకు స్ఫూర్తిదాయకమని చంద్రబాబు కొనియాడారు. భవిష్యత్తు తరాలకోసం భూములిచ్చిన అమరావతి రైతల త్యాగం వెలకట్టలేనిదని కొనియాడారు.
మహిళల పోరాటం స్ఫూర్తిదాయకం..
అమరావతి ఉద్యమాన్ని నడిపిస్తున్న మహిళల పోరాటం స్ఫూర్తిదాయకమని చంద్రబాబు కొనియాడారు. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా న్యాయంకోసం ఎదురునిలిచి పోరాడుతున్నాని అన్నారు.
'90శాతం ప్రజల మద్దతు మీకే ఉంది. అమరావతి ప్రజలు తమ హక్కుల కోసమే వారు పోరాడుతున్నారన్న సంగతి పోలీసులు గ్రహించాలి. కొంతమంది పోలీసులు ఉద్దేశపూర్వకంగా రైతులను ఇబ్బందిపెడుతున్నారు. పైవాళ్లు చెప్పిందల్లా చేస్తే భవిష్యత్తులో ఇబ్బందిపడేది మీరే.'- చంద్రబాబు
అమరావతిని కాపాడుకునేందుకు తాము ఎంతకైనా తెగిస్తామని ఈ సందర్భంగా మహిళలు చంద్రబాబుతో అన్నారు. భవిష్యత్తు తరాలకోసమే తాము భూములు త్యాగం చేశామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: