- నేను హిందువుగా పుట్టాను. వేంకటేశ్వరస్వామి నా ఇష్ట దైవం. మీ ఇష్ట దైవం ఏసుప్రభువు. మీరు గెలిస్తే జెరూసలెం వెళతారు. నేను గెలిస్తే వేంకటేశ్వరస్వామి దగ్గరకు వెళతాను. మీరు బైబిల్ దగ్గర పెట్టుకుంటారు. దానిలో తప్పులేదు. హిందూ దేవాలయాలపైనా, దేవుళ్లపైనా దాడులు జరిగితే మాత్రం ఖబడ్దార్... జాగ్రత్తగా ఉండండి- సీఎంను ఉద్దేశించి చంద్రబాబు
- ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీతో పాటు విజయనగరం జిల్లా ఎస్పీ కూడా క్రైస్తవులే. ఆ కేసు దర్యాప్తుని సీఐడీకి అప్పగించారు. దాని చీఫ్ సునీల్‌కుమార్ కూడా క్రైస్తవుడే. ఒకే మతానికి చెందిన ఇంతమందిని పెట్టుకుని... విగ్రహ విధ్వంసంపై విచారణలో ఏ విధంగా నమ్మకం కలిగించగలరు?- తెదేపా అధినేత చంద్రబాబు
కుల, మతాలకు అతీతంగా వ్యవహరిస్తానని, మత సామరస్యాన్ని కాపాడతానని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో మతమార్పిడుల్ని ప్రోత్సహిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ధ్వజమెత్తారు. చట్టానికి విరుద్ధంగా పాస్టర్లకు రూ.5వేల గౌరవభృతి ఇస్తున్నారని మండిపడ్డారు. 'ఓటు బ్యాంకు రాజకీయాలకు చర్చిలను కేంద్రంగా చేసుకుంటున్నారు. గ్రామాల్లో కొత్తగా ఎన్ని చర్చిలు వస్తున్నాయి? అవి ఎందుకు ఏర్పాటవుతున్నాయి? వాటి వెనుక ఎవరున్నారో తేలాలి...'అని పేర్కొన్నారు. 'ముఖ్యమంత్రి మతమార్పిడులను ప్రోత్సహించడమేమిటి? ఎవరిచ్చారు ఆ అధికారం? అది రాజ్యాంగ విరుద్ధం కాదా? క్రైస్తవ మతం తీసుకోవాలని దేవాలయాల దగ్గరకు వెళ్లి భక్తులపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రలోభ పెడుతున్నారు. పోలీసుస్టేషన్‌లో క్రిస్మస్ పండుగ చేస్తున్నారు. వేంకటేశ్వరస్వామి దేవాలయం వద్ద ఉపముఖ్యమంత్రి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. క్రైస్తవులకే మనోభావాలు ఉంటాయా? హిందువులకు, ముస్లింలకు ఉండవా?...' అని చంద్రబాబు నిలదీశారు. మతమార్పిడులను తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం తెదేపా కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రామతీర్థం ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. 'మేమేదో కుట్రలు చేస్తున్నట్టు సీఎం జగన్ చెబుతున్నారు. సింగరాయకొండకి కూడా నేనే ఈ రోజు పొద్దుటే వెళ్లి విగ్రహం ధ్వంసం చేసి వచ్చానని కూడా అనగలరు వీళ్లు...’ అని మండిపడ్డారు. తెదేపా ఏ మతానికీ వ్యతిరేకం కాదన్నారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల్ని, అన్యాయాల్ని, అక్రమాల్ని అరికట్టేందుకు మనస్సాక్షిగా పనిచేస్తుందని చెప్పారు. హిందువులతో పాటు, ముస్లింలపైనా దాడులు జరుగుతున్నాయన్నారు. ‘అప్రమత్తంగా ఉందాం. మన దేవాలయాల్ని, దేవుళ్లను మనమే కాపాడుకుందాం...' అని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.
- సీఎంకి వాటికన్ సిటీ అంటేనే ఆనందం.. అమరావతి పేరు చెబితే కంపరం..!
ఆయనకు అమరావతి పేరు చెబితేనే కంపరం. వాటికన్ సిటీ అంటే ఆనందం. శ్రీరాముడి విగ్రహానికి తల తీసేసినప్పుడే ఆయన రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత కోల్పోయారు. దానికి జగన్ సిగ్గుతో తలదించుకోవాలి. ఏ2 ఫిర్యాదు చేశాడని మాపై కేసులు పెట్టారు. వైకాపా నాయకులకు పోలీసులు ఊడిగం చేస్తున్నారు. ఈ రోజు కూడా సింగరాయకొండ వరాహలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ముఖద్వారం వద్ద విగ్రహాలు ధ్వంసం చేశారు. దీన్ని ఏమనుకోవాలి. మెజార్టీ ప్రజలైన హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తున్నారు. నేను 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశాను. ఆ సమయంలో ఒక్క మసీదుపైగానీ, చర్చిపైగానీ దాడులు జరగలేదు. వాటిని కాపాడటం ప్రభుత్వం బాధ్యత. ఈ సీఎంకి బాధ్యత లేదు. రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే... సీఎం, హోం మంత్రి, డీజీపీలు అక్కడికి వెళ్లలేదు. దేవాదాయశాఖ మంత్రి, అదే జిల్లాకు ఇన్‌ఛార్జి మంత్రిగా ఉండి కూడా అక్కడకు వెళ్లలేదు సరికదా... అశోక్‌గజపతిరాజుని దుర్భాషలాడారు. ఆయనకూ వీళ్లకూ పోలిక ఉందా? వాళ్లది సేవాభావం కలిగిన కుటుంబం... వీళ్లవి దోచుకునే కుటుంబాలు. సింహాచలం దేవస్థానానికి పీవీజీ రాజు ఇచ్చిన ఆస్తుల విలువ ఇప్పుడు రూ.10 లక్షల కోట్లు. అశోక్ కుటుంబానికి వారసత్వంగా వచ్చిన ట్రస్ట్ ఛైర్మన్ పదవిని మార్చేశారు. అదే ఏ చర్చి విషయంలోనైనా అలా చేయగలరా? చర్చి ఆస్తులపై పెత్తనం చేయగలరా? హిందూ దేవాలయాలపైనే ఎందుకు చిన్నచూపు-చంద్రబాబు, తెదేపా అధినేత
ప్రతి తప్పుడు కేసునీ సమీక్షిస్తాం..!
వైకాపా ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతున్నా... పార్టీ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా పోరాడుతున్నారని చంద్రబాబు అభినందించారు. తెదేపా అధికారంలోకి వచ్చాక ప్రతి తప్పుడు కేసునీ సమీక్షిస్తామని, తప్పు చేసిన పోలీసు అధికారుల్నీ వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. '60 లక్షల సైన్యంగల ఏకైక పార్టీ తెలుగుదేశం. పోరాడితేనే న్యాయం జరుగుతుంది. ఎక్కడ ఎవరిపై ఎలాంటి అన్యాయం జరిగినా, ఎవరిపై దాడి జరిగినా, ఎలాంటి విధ్వంసం చోటు చేసుకున్నా అందరూ స్పందించాలి. అందరూ కమ్ముకుని రావాలి. నాయకుల్ని తయారు చేసుకునే శక్తి, సత్తా ఉంది...' అని పేర్కొన్నారు. 'ఎన్నికలు ఎప్పుడొచ్చినా పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలి. తిరుపతి లోక్‌సభ స్థానం ఉపఎన్నికలో, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపాకి బుద్ధి చెప్పాలి...' అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: