జగన్‌కు ఓటు వేసినందుకు ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. అగ్రిగోల్డ్ వ్యవహారంపై ప్రభుత్వం చేసేవన్నీ తప్పుడు ఆరోపణలేనని ఆయన మండిపడ్డారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసింది తెదేపానేని స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చేందుకు తెదేపా హయాంలో కేటాయించిన నిధుల్లో వైకాపా సర్కార్ కోత విధించిందని ఆరోపించారు. వైకాపా కార్యకర్తలకు ప్రజాధనాన్ని దోచి పెట్టేందుకే గ్రామ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సంవత్సరానికి రూ.7,500 ఇస్తుంటే, కార్యకర్తలకు మాత్రం వైకాపా ప్రభుత్వం నెలకు వేలల్లో జీతాన్ని అందిస్తోందని మండిపడ్డారు. వాలంటీర్లలో 90శాతం మంది వైకాపా కార్యకర్తలే ఉన్నారని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. 4లక్షల మంది కార్యకర్తలకు ఉద్యోగాలు ఇవ్వడానికి 20 లక్షల మంది యువత పొట్టకొడతారా అని చంద్రబాబు ధ్వజమెత్తారు.
రాయలసీమకు ద్రోహం చేసింది రాజశేఖర్ రెడ్డే
ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతుంటే చేష్టలు మాత్రం గడప కూడా దాటడం లేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురిసినా రాయలసీమకు నీటి వినియోగంపై దృష్టి పెట్టలేదని దుయ్యబట్టారు. ఎన్నడూ లేని విధంగా తెదేపా హయాంలో నీటిపారుదలకు 73వేల కోట్లు పైచిలుకు ఖర్చు పెట్టామని స్పష్టం చేశారు. పోలవరంలో ఈ 7నెలల్లో ఒక్క తట్ట మట్టి కూడా వేయలేదని మండిపడ్డారు. రాయలసీమకు నీరు ఇవ్వాలని తొలిసారిగా సంకల్పించింది ఎన్టీఆర్ అని స్పష్టం చేశారు. రాయలసీమకు ద్రోహం చేసింది రాజశేఖర్ రెడ్డే అని విమర్శించారు. మిగులు జాలాలు వద్దని ట్రిబ్యునల్‌కు లేఖ ఇచ్చింది వైఎస్ఆర్ అని... మనకున్న హక్కులను సరెండర్ చేసి ఇప్పుడు గొప్పలు మాట్లాడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి...