చర్రితలో ఎప్పుడూ ధర్మం, న్యాయమే గెలిచాయి. తాత్కాలికంగా కొన్ని బాధలు అనుభవించినా... విజయం మీదే. మీరు కనబరుస్తున్న పోరాట స్ఫూర్తి అభినందనీయం. - తెదేపా అధినేత చంద్రబాబు
ఈనాడు, అమరావతి: ‘‘అమరావతిని రాజధానిగా నిర్ణయించడాన్ని నాడు శాసనసభలో వైకాపా నాయకులు సమర్థించినప్పుడు, కనీసం 30 వేల ఎకరాలు ఉండాలని చెప్పినప్పుడూ లేని కులం ఇప్పుడొచ్చిందా? అమరావతిపై ఆ రోజు లేని అయిష్టత ఇప్పుడెందుకు ఏర్పడింది? ఆ రోజు అధికారం కోసం ఏమైనా మాట్లాడి, ఇప్పుడు మూడు ముక్కలాటతో అమరావతిని, ఆంధ్రప్రదేశ్‌ని నాశనం చేస్తారా?’’ అని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ‘‘రాజధాని కాకపోయినా విశాఖ అభివృద్ధి చెందలేదా? మీరు అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో తిరుపతి, కర్నూలు వంటి నగరాల్ని ఏం అభివృద్ధి చేశారు? ఒకప్పుడు ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో మూడు ఎకరాలు వచ్చేదని, ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎకరాలు కొనొచ్చునని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న మాటలు నిజం’’ అని చంద్రబాబు గుర్తుచేశారు. అమరావతి పరిరక్షణ ఉద్యమం 500 రోజులకు చేరిన సందర్భంగా శుక్రవారం నిర్వహించిన వర్చువల్ సభలో ఆయన హైదరాబాద్ నుంచి పాల్గొన్నారు. ‘‘వైకాపా ప్రభుత్వం అమరావతిపై కుల ముద్ర వేసి విధ్వంసం చేయాలనుకుంటోంది. అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ శివారెడ్డిది ఏ కులం? ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తోంది. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని దుష్ప్రచారం చేసింది. ఏ చట్టం ప్రకారం అది ఇన్‌సైడర్ ట్రేడింగో చెప్పమంటే చెప్పదు’’ అని ఆయన మండిపడ్డారు.
దాడి చేయడమే వైకాపా లక్ష్యం
‘‘ఆ రోజు నేను హైదరాబాద్‌ని అభివృద్ధి చేస్తే... నా అనంతరం వచ్చిన పాలకులు రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి... వీలైతే మరింత మెరుగుపరిచారే తప్ప చెడగొట్టలేదు. అమరావతిని కూడా నాకంటే మెరుగ్గా అభివృద్ధి చేయగలిగితే చేయాలి. దానికి భిన్నంగా అమరావతిపై దాడి చేయడమే వైకాపా లక్ష్యంగా పెట్టుకుంది’’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘‘వైకాపా అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో రాష్ట్రానికి మంచి చేయాలనో, ఒక ప్రాజెక్టు తేవాలనో ఆలోచించకుండా, అధికారాన్ని విధ్వంసానికే వాడుకుంది. రెండేళ్లుగా అమరావతిలో పాడుబడిపోతున్న భవనాల్ని చూస్తే బాధేస్తోంది. అమరావతిలో ఇప్పటికే శాసనసభ, సచివాలయం, హైకోర్టు పనిచేస్తున్నాయి. ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేకపోతే ఉన్నప్పుడే నిర్మించేది. కానీ దాన్ని పనిగట్టుకుని నాశనం చేయడం వెనుక రహస్య అజెండా ఏంటో అర్ధం కావడంలేదు’’ అని ఆయన ధ్వజమెత్తారు.
ఎంత హింస పెడితే అంత రాటుదేలారు
‘‘రాజధాని కోసం ఉద్యమిస్తున్న రైతులు, మహిళలు, పేదలను ప్రభుత్వం ఎంత హింసపెడితే, ఎంత వేధిస్తే అంత రాటులేదారు. ఒత్తిళ్లను తట్టుకుని ఉద్యమాన్ని నిర్భయంగా కొనసాగిస్తున్న మీ అందరికీ పాదాభివందనం’’ అని చంద్రబాబు కొనియాడారు. ‘‘చర్రితలో ఎప్పుడూ ధర్మం, న్యాయమే గెలిచాయి. తాత్కాలికంగా కొన్ని బాధలు అనుభవించినా... అంతిమ విజయం మీదే’’ అని భరోసా ఇచ్చారు.
‘‘తాను తీసుకున్న నిర్ణయానికి సుమారు 29 వేల మంది రైతులు బాధపడుతూ దీక్షలు చేస్తోంటే 500 రోజుల్లో ఒక్కసారైనా వారిని కలిసి మాట్లాడని పాలకుడిని చూడటం చరిత్రలో ఇదే తొలిసారి’’ అని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు శుక్రవారం ట్వీట్ చేశారు.
చంద్రబాబుని నమ్మొద్దని చెప్పి మీ గొంతు కోశాం
'ప్రభుత్వం కేసులు పెట్టి, హింసించినా... దీక్షగా 500 రోజులుగా ఉద్యమిస్తున్న మీ అందరికీ విప్లవాభివందనాలు. ఎన్నికల ముందు మేమంతా అమరావతికి బాసటగా ఉంటామని చెప్పాం. మా నాయకుడు ఇక్కడే బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకున్నారని, రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పాం. మరోవైపు వైకాపా అధికారంలోకి వస్తే అమరావతికి అన్యాయం జరుగుతుందని చంద్రబాబు ఎంతగా ఘోషించినా... ఆయన మాటలు నమ్మొద్దని మీకు చెప్పి, మీ గొంతు కోశాం. ఆ పాపంలో సింహభాగం మా ముఖ్యమంత్రిదే అయినా... నాకూ కొంతభాగం ఉన్నందుకు సిగ్గుపడుతున్నా. ఇప్పుడు క్షమించండని వేడుకుంటున్నా.'-రఘురామ కృష్ణరాజు, వైకాపా ఎంపీ
ఒప్పందాన్ని ఉల్లంఘించడం సాధ్యం కాదు
'ఆంధ్రప్రదేశ్‌కు ఒకే రాజధాని ఉండాలని, దాని నిర్మాణం కొత్త ప్రదేశంలో జరగాలని విభజన చట్టంలో స్పష్టంగా ఉంది. భూములిచ్చిన రైతులతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ప్రస్తుత ప్రభుత్వం ఉల్లంఘించడం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యమవదు. ఆంధ్రులుగా మనం ప్రతిసారీ నష్టపోతూనే ఉన్నాం. మద్రాసు నుంచి కర్నూలుకు, కర్నూలు నుంచి హైదరాబాద్‌కు వచ్చాం. విభజన తర్వాత రాజధాని లేకుండా మిగిలాం. ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారు. వారిలో 21 వేల మంది చిన్న, సన్నకారు రైతులే. ఎస్సీ, ఎస్టీలు 32% మంది. వారికి ఈ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోంది.'-టి.గోపాలరావు, విశ్రాంత ఐఏఎస్ అధికారి
3 రాజధానుల చట్టాలు రాజ్యాంగ విరుద్ధం
''మూడు రాజధానులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు రాజ్యాంగ విరుద్ధమైనవి... అసంబద్ధమైనవి. హైకోర్టులో రైతులకు కచ్చితంగా విజయం లభిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. ప్రభుత్వానికి, వ్యక్తులకు మధ్య ఏదైనా ఒప్పందం ఉంటే దాన్ని రద్దు చేసుకోవడానికి చట్టం చేయాలి. కానీ... అమరావతి రైతులతో కుదుర్చుకున్న ఒప్పందం రద్దుకు ఎలాంటి చట్టమూ లేదు. అందుకే ఈ విషయంలో ప్రభుత్వమిచ్చిన ఉత్తర్వులు, తీర్మానాలు ఏవీ చట్టం ముందు నిలబడవు. భూ సమీకరణ పథకంలో రైతులతో కుదుర్చుకున్న ఒప్పందానికి ప్రభుత్వం తప్పనిసరిగా కట్టుబడి ఉండాలి. అమరావతి ఉద్యమకారులపై ప్రభుత్వం, పోలీసులు అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టటం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది. వీటిని క్వాష్ చేసే అధికారం హైకోర్టుకు ఉంది. మీ ఉద్యమం విజయవంతం కావాలని కోరుకుంటున్నా.’’-జస్టిస్ వి.గోపాలగౌడ, సుప్రీం మాజీ న్యాయమూర్తి
కేంద్ర సంస్థలేవీ వెనక్కి వెళ్లవు
అమరావతి అభివృద్ధి కోసం కేంద్రం గతంలో ప్రకటించిన సంస్థలేవీ వెనక్కి వెళ్లవు. రాజధాని నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకునే కేంద్రం ఇక్కడ ఎయిమ్స్ నిర్మించింది. అనంతపురానికి ఆరు వరుసల రహదారి, కర్నూలు-అమరావతి రహదారి, డిఫెన్స్‌కు సంబంధించిన సంస్థలు, నేచర్ క్యూర్ ఇన్‌స్టిట్యూట్... ఇలా కేంద్రం చెప్పిన ఏఒక్కటీ వెనక్కి తీసుకోదు. అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు భూములు తీసుకున్నాయి. మౌలిక సదుపాయాలు కల్పిస్తే నిర్మాణాలు ప్రారంభిస్తాయి. రాష్ట్ర రాజధాని అమరావతి అనేది భాజపా వైఖరి. సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికే అమరావతిలో రూ.7,200 కోట్లు ఖర్చు చేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ఉన్న మూడేళ్లలో విశాఖలో రాజధాని కడతామనే దాన్ని మేం విభేదిస్తున్నాం. ఇది సరైన వైఖరి కాదు.’’-సోమువీర్రాజు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
నాడు ఎందుకు సమర్థించారు?
"అప్పట్లో ప్రతిపక్షనేతగా ఉండి అమరావతిని రాజధానిగా ఎందుకు సమర్థించారో సీఎం జగన్ ప్రజలు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఇష్టారీతిన మూడు రాజధానులు చేస్తామంటే కుదరదు. రాష్ట్రం ఉనికినే ప్రశ్నార్థకం చేస్తే నిర్ణయాన్ని సీఎం తీసుకున్నారు. ఇది పొరపాటు కాదు. మొండి పట్టుదలకుపోతూ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. అభివృద్ధి ఎన్ని రోజులు ఆగితే రాష్ట్రం అంత వెనుకబడినట్లే. రాజధాని ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏ ముఖం పెట్టుకుని ప్రజల ముందు తిరుగుతున్నారో అర్థం కావడం లేదు. రాజధాని తరలింపును అంగీకరించబోం. అమరావతే రాష్ట్ర రాజధాని అనేది మా పార్టీ విధానం.’’-శైలజానాథ్, ఏపీసీసీ అధ్యక్షుడు
కేంద్రం బాధ్యత తీసుకోవాలి
"విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాజధానికి కేంద్రం సహకారం ఇవ్వాలని స్పష్టం చెప్పారు. అమరావతిలో 42 కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణానికి భూములు కేటాయించారు. జాప్యం చేయకుండా వాటిని నిర్మించాలి. అమరావతిని రాజధానిగా రాష్ట్ర భాజపా పేర్కొంటున్నా కేంద్రం మాత్రం ముందుకురావడం లేదు. దీనిపై కేంద్రం స్పష్టమైన వైఖరి ప్రకటించాలి. మెజార్టీ ఉన్నా సీఎం జగన్ అప్రజాస్వామిక విధానాలను అమలు చేస్తున్నారు. ఏ ప్రజాస్వామ్యం ద్వారా అయితే 2019 ఎన్నికల్లో గెలిచి జగన్ గద్దెనెక్కారో అధికారాన్ని చేపట్టగానే దానికి పాతరేస్తున్నారు.’’-రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
ఇదీ చదవండి: ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాల్సిందే