శాసనసభాపతిపై వ్యాఖ్యల విషయంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇచ్చిన వివరణపై వ్యక్తిగతంగా సంతృప్తి చెందడం కాకుండా.. దాన్ని కమిటీ సభ్యులందరికీ పంపుతామని, వాళ్ల అభిప్రాయం చెప్పాక తుది నిర్ణయం తీసుకుంటామని అసెంబ్లీ సభా హక్కుల సంఘం ఛైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి వెల్లడించారు. ‘అచ్చెన్నాయుడిని మొత్తం 10 అంశాలపై విచారణ కోరాం. తన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకం కాదని.. కార్యాలయంలో ఉంచిన ప్రెస్‌నోట్ పొరపాటున బయటకు వచ్చిందని, వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నానని తెలిపారు. ఈ వ్యవహారాన్ని పొడిగించదలచుకోలేదని.. తన పేరుతో వచ్చినందునే విచారం వ్యక్తం చేస్తున్నట్లు సమాధానమిచ్చారు’ అని తెలిపారు. మంగళవారం శాసనసభ కమిటీ హాలులో అసెంబ్లీ సభా హక్కుల సంఘం సమావేశమైంది. సభాపతిపై వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నట్లు అచ్చెన్నాయుడు చెప్పడంతో.. సభ్యుల అభిప్రాయం మేరకు ఫిర్యాదును వదిలేయాలా, లేక చర్యలు తీసుకోవాలా అనేదానిపై నిర్ణయం తీసుకోవాలని సభా హక్కుల కమిటీ తీర్మానం చేసింది.
మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆగస్టు 31న జరిగిన కమిటీ సమావేశానికి వ్యక్తిగతంగా హాజరవ్వకుండా ధిక్కరణకు పాల్పడ్డారని కమిటీ అప్పుడే రికార్డు చేసినట్లు ప్రస్తావించింది. సమావేశం జరిగిన మర్నాడు రవికుమార్ ఫోన్ చేసి తాను అందుబాటులో లేనని, నోటీసు అందలేదని చెప్పారని గోవర్ధన్‌రెడ్డి సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. ఆయన మాటలు ఎంతవరకు నిజమో.. నోటీసు పంపిన సమయంలో వాస్తవంగానే అందుబాటులో లేరా..? ఉండి కూడా నోటీసులు తీసుకోలేదా..? లేక నోటీసు తీసుకుని అందలేదని అంటున్నారా..? అనే అంశాలపై జిల్లా యంత్రాంగంతో విచారణ చేయించాలని నిర్ణయించారు. దాన్నిబట్టి ఆయనపై రికార్డు చేసిన ధిక్కరణను ఎత్తేయాలా..? లేదా..? అనే విషయంలో నిర్ణయం తీసుకోవాలని, అనంతరం తదుపరి చర్యలకు ఉపక్రమించాలని కమిటీ అభిప్రాయపడింది.
21న మరోసారి సమావేశం
ఈ నెల 21వ తేదీన మరోమారు సమావేశం నిర్వహించి పెండింగ్‌లో ఉన్న వాటన్నింటినీ పరిష్కరిస్తామని, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోగా స్పష్టత ఇవ్వడానికి ప్రయత్నిస్తామని కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. సమావేశం అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ‘నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు ఆనం రామనారాయణరెడ్డి వ్యవహారాన్ని ఎజెండాగా స్వీకరిస్తాం. ఆగస్టు 15న స్వాతంత్య్ర వేడుకలకు అధికారులు ఆహ్వానించలేదని ఆయన ఫిర్యాదు చేశారు. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశమే. అధికారికంగా జరిగే స్వాతంత్య్ర వేడుకలకు ఎమ్మెల్యేలను పిలవకపోవడం సరికాదు. మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు స్పీడ్‌పోస్టు ద్వారా నోటీసు పంపించి 13 రోజులైంది. మరో 10 రోజుల సమయం ఉన్నందున ఈ నెల 21న వివరణ వస్తుందని భావిస్తున్నాం. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నుంచి వివరణ వస్తుందని ఆశిస్తున్నాం’ అని తెలిపారు.
- వైకాపా ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఫిర్యాదుపై అసెంబ్లీ సభా హక్కుల సంఘం సమావేశంలో ఎక్కువ చర్చ జరిగిందని, ఈ విషయంలో రాష్ట్రమంతా ఓ సందేశం వెళ్లేలా దీన్ని పరిష్కరించాలని భావిస్తున్నట్లు సంఘం సభ్యుడు అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
నా వివరణపై కమిటీ సంతృప్తి చెందింది: అచ్చెన్నాయుడు
శాసనసభాపతి తమ్మినేని సీతారాంపై బహిరంగంగా, కించపరిచేలా వ్యాఖ్యలు చేయకపోయినా అసెంబ్లీ సభాహక్కుల కమిటీ ముందు విచారణ వ్యక్తం చేశానని, తన వివరణపై కమిటీ సంతృప్తి వ్యక్తం చేసిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు తెలిపారు. చట్టం, న్యాయం, వ్యవస్థలపై గౌరవమున్న వ్యక్తిగా.. ఎలాంటి భేషజాలకు పోకుండా విచారం వ్యక్తం చేసినట్లు తెలిపారు. మంగళవారం అసెంబ్లీ సభా హక్కుల కమిటీ సమావేశానికి హాజరైన అనంతరం అచ్చెన్నాయుడు విలేకర్లతో మాట్లాడారు. ‘గత రెండేళ్లలో స్పీకర్ తమ్మినేని వివిధ సందర్భాల్లో అనేక విషయాలు మాట్లాడారు. మొదట వైకాపా ఎమ్మెల్యేను.. ఆ తర్వాతే సభాపతినని.. ఏదైనా మాట్లాడొచ్చని వ్యాఖ్యానించారు.
మా పార్టీని కించపర్చేలా.. మేం ఇబ్బందిపడేలా మా నాయకుడిపై వ్యాఖ్యలు చేశారు. అగ్రిగోల్డ్ వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉండగా.. మా పార్టీ అధ్యక్షుడికి ముడిపెడుతూ అత్యంత దారుణంగా మాట్లాడారు. ఇవన్నీ చూశాక సీనియర్ ఎమ్మెల్యేగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రెస్‌నోట్ తయారుచేశాం. స్పీకర్‌పై వ్యాఖ్యలు సరికాదన్న ఉద్దేశంతో ప్రెస్‌నోట్‌పై సంతకం చేయలేదు. అయినా అది బయటకు వచ్చింది. నేనెక్కడా ప్రెస్‌మీట్లు పెట్టి బహిరంగ వ్యాఖ్యలు చేయకపోయినా, ప్రెస్‌నోట్ చూసి సమన్లు పంపించారు. నోట్ వ్యవహారంలో సభా హక్కుల సంఘానికి బాధ కలిగితే విచారం వ్యక్తం చేస్తున్నా’ అని తెలిపారు.
ఇదీ చూడండి: జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల.. 18 మందికి టాప్ ర్యాంక్!