ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదనపు నిధుల సమీకరణకు కేంద్రం అనుమతి జారీ చేసింది. పట్టణ ప్రాంత స్థానిక సంస్థల సంస్కరణల్లో ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నట్టు కేంద్ర ఆర్ధికశాఖ వెల్లడించింది. స్థానిక సంస్థల నిర్వహణలో ఈ రెండు రాష్ట్రాలు సంస్కరణలను విజయవంతంగా అమలు చేసినట్టు పేర్కోంది. ఈ నేపథ్యంలో పౌరులకు అందించే సేవలను మరింత సమర్ధంగా అందించేందుకు అదనపు నిధుల సమీకరణకు కేంద్రం అనుమతి జారీ చేసింది.
రెండు రాష్ట్రాలూ మొత్తంగా రూ.4,898 కోట్లు నిధుల్ని సమీకరించుకోవచ్చని స్పష్టం చేసింది. ఇందులో రూ.2,525 కోట్లు బహిరంగ మార్కెట్ నుంచి సమీకరించుకునేందుకు ఏపీకి అనుమతించింది. కొవిడ్ కారణంగా ఇప్పటికే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో పరిమితికి అదనంగా 2 శాతం నిధులు సమీకరించుకునేందుకు కేంద్ర ఆర్థికశాఖ అవకాశం కల్పించింది. అయితే సమీకరించే నిధులు జీఎస్డీపీలో 0.25 శాతానికి సమానంగా ఉండాలని స్పష్టం చేసింది.
'ఒకే దేశం - ఒకే రేషన్' కార్డుతో పాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, విద్యుత్ రంగంలో సంస్కరణల్ని అమలు చేసినందుకు గానూ ఈ అదనపు నిధుల సమీకరణకు కేంద్రం అనుమతించింది. పట్టణ నగర ప్రాంతాల్లో పన్నుల పెంపునకు సంబంధించి, ఆస్తి పన్నుల పెంపుపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ చట్ట సవరణ చేసింది. ఏపీ మున్సిపాలిటీల చట్టం, విశాఖ, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ల చట్టాలను ఏపీ సవరించింది.
ఇదీ చదవండి: అనపర్తి, బిక్కవోలులో తీవ్ర ఉద్రిక్తత.. 144 సెక్షన్ విధింపు