అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గత నెలలో వచ్చిన వరదలకు తీవ్రంగా నష్టపోయిన పంటలకు సంబంధించిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని కేంద్ర బృందానికి నాయకత్వం వహించిన జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఫైనాన్షియల్ అడ్వైజర్ రవినేష్‌కుమార్ తెలిపారు. గోదావరి వరదలతో నష్టపోయిన పంటలు, ఇళ్లను పరిశీలించేందుకు అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కేంద్ర బృందం సభ్యులు గురువారం పర్యటించారు. వారు రావులపాలెం మండలం గోపాలపురం, పి.గన్నవరం మండలం నాగుల్లంక, రాజోలు ప్రాంతాల్లో పర్యటించారు. గోపాలపురంలో ఏర్పాటుచేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. అనంతరం పి.గన్నవరం మండలం నాగుల్లంక, గుడ్డాయిలంక, పల్లిపాలెంలో పర్యటించారు. పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలను తాము పరిశీలించామని రవినేష్‌కుమార్ తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నష్ట అంచనాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తుది నివేదికను కేంద్రానికి అందిస్తామన్నారు.
ఉదారంగా స్పందించండి
గోదావరి వరద నష్టానికి సాయం విషయంలో ఉదారంగా స్పందించాలని రాష్ట్ర విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 2రోజులుగా పర్యటించిన కేంద్ర బృందాలు గురువారం విజయవాడలోని ఒక హోటల్‌లో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సాయిప్రసాద్‌తోపాటు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేడ్కర్ వారికి వరద నష్టం, ప్రభుత్వ సహాయ చర్యలను వివరించారు. వరద ఉద్ధృతిపై కలెక్టర్లకు ఎప్పటికప్పుడు సూచనలు ఇచ్చామని, సహాయ బృందాలను తరలించామని తెలిపారు. బృందాలు చేరలేని ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని గ్రామాలకు హెలికాప్టర్ల ద్వారా 6రోజుల పాటు ఆహారం, నిత్యావసరాలు అందించామన్నారు. వరద కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించామని, అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు ఎక్కువ నష్టం జరిగిందని కేంద్ర బృందానికి నాయకత్వం వహించిన హోమంత్రిత్వశాఖ ఆర్థిక సలహాదారు రవినేశ్‌కుమార్ పేర్కొన్నారు. కమిటీ నివేదికను కేంద్రానికి వీలైనంత త్వరగా అందిస్తామని వివరించారు.
ఇదీ చదవండి: