కేంద్రమంత్రిగా తనకు అవకాశమివ్వటాన్ని కార్యకర్తలకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నానని కిషన్రెడ్డి అభివర్ణించారు. కేబినెట్ మంత్రిగా అవకాశం కల్పించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. బడుగుబలహీన వర్గాల నుంచి వచ్చిన ఎంతో మందికి కేబినెట్లో అవాకాశమిచ్చారని తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి వెంకయ్య నాయుడు తర్వాత తనకు ఈ అవకాశం ఇవ్వటం ఎంతో గర్వంగా ఉందని తెలిపారు.
ఏ శాఖ ఇచ్చినా చిత్తశుద్ధితో నెరవేరుస్తా..
"కేబినెట్లో ఏ మంత్రిత్వ శాఖ ఇచ్చినా సమర్థవంతంగా నెరవేరుస్తా. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తోన్న సబ్కాసాత్ సబ్కా వికాస్ స్ఫూర్తితో రెండు తెలుగు రాష్ట్రాలను సమన్వయంతో పనిచేసేందుకు కృషిచేస్తా. విభజన తర్వాత ఏర్పడిన సమస్యల పరిష్కారానికి పాటుపడుతా. రెండు రాష్ట్రాల అభివృద్ధికి నా వంతుగా ఎలాంటి సహకారం కావాల్సి వచ్చినా చేస్తా. తెలుగు ప్రజలకు మంచి పేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తా. నా మీద ఉంచిన బాధ్యతను మోదీ, అమిత్షా, నడ్డా ఆశీర్వాదంతో అంకితభావంతో చిత్తశుద్ధితో తెలుగు ప్రజలకు మంచి పేరు తెచ్చేలా పనిచేస్తా."
- కిషన్రెడ్డి, కేంద్ర మంత్రి
ఆస్పత్రుల్లో సౌకర్యాల కల్పనకు కృషి..
నరేంద్ర మోదీ నాయకత్వంలో కరోనాపై పోరాటంలో అన్ని వర్గాలను కలుపుకొని పోతున్నామని కిషన్రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని ఆస్పత్రులను పరిశీలించి మౌలిక సౌకర్యాల కల్పనకు కృషిచేసినట్లు తెలిపారు. వ్యాక్సిన్ విషయంలోనూ ప్రభుత్వం చెప్పిన అన్ని విధులు నిర్వర్తించినట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: సామాన్య కార్యకర్త నుంచి కేంద్రమంత్రి దాకా...
తెలుగు ప్రజలందరికీ కృతజ్ఞతలు..
"ఇప్పటి వరకు సహాయమంత్రిగా పలు చట్టాలు చేయటంలో భాగస్వామ్యమయ్యాను. ఇప్పుడు కేబినెట్ మంత్రిగా ఎలాంటి బాధ్యత ఇచ్చినా అంతే చిత్తశుద్ధితో కృషి చేస్తా. 1980 నుంచి ఇప్పటి వరకు ఎన్నో బాధ్యతలు నెరవేర్చాను. అప్పడు సాధారణ కార్యకర్తగా ఎలా పనిచేశానో.. ఇప్పుడు కూడా అంతే సేవాభావంతో కృషి చేస్తా. నేను ఈ స్థాయికి రావటానికి కారణమైన... నన్ను గెలిపించిన సికింద్రాబాద్ ప్రజానికానికి, తెలుగు ప్రజలందరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇన్నేళ్ల నా రాజకీయ జీవితంలో ఇది మరుపురాని సంఘటన."
- కిషన్రెడ్డి, కేంద్ర మంత్రి
సీఎంల వల్ల కాకపోతే మేము...
తెలంగాణలో భాజపా అధికారంలోకి వచ్చేందుకు తన కేంద్ర మంత్రి పదవికి ఎలాంటి సంబంధం లేదన్న కిషన్రెడ్డి... ఆ దిశగా పార్టీ తరఫున తన వంతు కృషి చేస్తానని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్న కృష్ణా జలాల వివాదాన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని చర్చించుకోవాలన్నారు. జల వివాదమైనా.. మరే విషయమైనా... రెండు రాష్ట్రాల సీఎంలు పరిష్కరించుకోలేని సమయంలో కేంద్రం ప్రభుత్వం ఆ బాధ్యతను తీసుకుంటుందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
Revanth Reddy: వారిని పార్టీ నుంచి బయటకు పంపుతా: రేవంత్‌రెడ్డి