దుబాయ్.. పాకిస్థాన్ దేశాల నుంచి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌కు వస్తున్న కొన్ని అనుమానాస్పద ఫోన్‌కాల్స్‌పై కేంద్ర నిఘావర్గాలు దృష్టి కేంద్రీకరించాయి. ఇంటర్నెట్ ఫోన్‌లను రూట్‌కాలింగ్‌కు అనుసంధానించి సంభాషణలు కొనసాగిస్తున్నారని, సమాంతర టెలిఫోన్ ఎక్ఛేంజీల్లా ఉన్న వీటిని ఘరానా నేరస్థులు వినియోగిస్తున్నారని గుర్తించాయి.
రూట్ కాలింగ్ కేంద్రం నిర్వహిస్తూ గత నెలలో దిల్లీలో పట్టుబడిన నలుగురు నిందితులు.. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లోనూ ఇలాంటి కేంద్రాలున్నాయని విచారణలో వెల్లడించడంతో ఆయా నగరాల పోలీసులకు సమాచారం అందించాయి. ఉగ్ర సంస్థలతో సంభాషిస్తున్నారా? మరేదైనా జరుగుతోందా? అనే విషయమై దర్యాప్తు చేపట్టాలంటూ ఆదేశించాయి.
వాట్సప్ ఉన్నా..ఇంటర్నెట్ ఫోన్లు ఎందుకు?
జూన్ నెలలో బెంగళూరులోని భారత సైన్యాధికారులతో పాకిస్థాన్‌కు చెందిన ఓ గూఢచారి మాట్లాడారు. సంభాషణలు అనుమానాస్పదంగా ఉండటంతో మిలటరీ నిఘా వర్గాలు రంగంలోకి దిగి గుట్టురట్టు చేశాయి. నిఘా వర్గాల సమాచారంతో ముంబయి పోలీసులు రూట్ కాలింగ్ కేంద్రాలపై దృష్టి కేంద్రీకరించారు. ముంబయి నుంచి పాకిస్థాన్, దుబాయ్‌కి ఎక్కువగా ఫోన్లు వెళ్తూ, వస్తున్నట్టు గుర్తించారు.
దిల్లీ పోలీసులు గత నెల రూట్‌కాలింగ్ కేంద్రం నిర్వహిస్తున్న నలుగురు నేరస్థులను అరెస్ట్ చేశారు. నిందితులు గల్ఫ్‌దేశాలు, పాకిస్తాన్‌కు రోజుకు 50 వేల కాల్స్ చేయిస్తున్నట్టు దర్యాప్తులో తేల్చారు. కొద్దినెలల క్రితం పాకిస్థాన్ నుంచి ఒక ఫోన్‌కాల్ జమ్ము-కశ్మీర్‌కు, వెనువెంటనే మరో కాల్ హైదరాబాద్ ఫలక్‌నుమా ప్రాంతానికి రావడంతో కేంద్ర నిఘా వర్గాలకు అనుమానం వచ్చింది. వీటి చిరునామా తెలుసుకున్న నిఘా అధికారులు తక్షణం సమాచారం ఇచ్చారు.
రూట్ కాలింగ్ కేంద్రాలపై...
దక్షిణమండలం పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు. తాజాగా కేంద్ర నిఘా వర్గాలు హైదరాబాద్‌లో రూట్‌కాలింగ్ కేంద్రాలపై హెచ్చరికలు పంపడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ‘ఇటీవల ఎక్కువ మంది విదేశాల్లో నివసిస్తున్న తమ బంధువులతో వాట్సాప్ ద్వారానే మాట్లాడుతున్నారు. దుబాయ్, పాకిస్థాన్, ఇరాక్, ఇరాన్ దేశాల్లో వాట్సప్ వాడే వీలున్నా రూట్ కాలింగ్ కేంద్రాల ద్వారా ఫోన్లు ఎందుకు మాట్లాడుతున్నారు? అనేది దర్యాప్తులో తేలుతుంది’ అని ఓ పోలీస్ అధికారి తెలిపారు.
ఇదీ చూడండి: Erravaram Accident: బైకును ఢీకొట్టిన బస్సు... ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు