కరోనా కేసుల సంఖ్యను దాచే ప్రయత్నం చేయొద్దని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. ఎక్కువ మందికి టెస్టులు నిర్వహించడం వల్ల కేసుల సంఖ్య పెరగవచ్చని... కేసులు అధికంగా నమోదైనా ఆందోళన చెందవద్దని సూచించారు. రెడ్‌జోన్, కంటైన్మెంట్ జోన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
దిల్లీ నుంచి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ నుంచి సీఎస్ నీలం సాహ్ని, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, ఐజీ వినీత్ బ్రిజ్లాల్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కె.భాస్కర్ సమావేశంలో పాల్గొన్నారు. వైద్య సదుపాయాలను సమీకరించుకోవడంతో పాటు.. వెంటిలేటర్లు, ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేసుకోవాలని గౌబా ఆదేశించారు. ఐసీయూ పడకలను ఎక్కువగా సిద్ధం చేసుకోవాలన్నారు.
లాక్డౌన్ కఠినతరం చేయండి
కరోనా నియంత్రణకు అందుబాటులో ఉన్న అన్ని సదుపాయాలు వినియోగించుకోవాలని గౌబా సూచించారు. లాక్డౌన్ నిబంధనలను మే 3 వరకూ కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకూ లాక్ డౌన్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయడం వల్ల కరోనా కట్టడి సాధ్యమైందన్నారు. కొన్ని జిల్లాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా లాక్డౌన్ నిబంధనల మరింత కఠినతరం చేయాలన్నారు.
రంజాన్ తదితర పర్వదినాలను పురస్కరించుకుని అధిక సంఖ్యలో ప్రజలు ఒక చోట గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయమై ఆయా మతపెద్దలతో రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడాలని చెప్పారు. రేషన్ దుకాణాలు, నిత్యావసర సరకులు తీసుకునే చోట, రైతు బజార్లు, ఏటీఎమ్‌లు, బ్యాంకుల్లో భౌతికదూరాన్ని పాటించేలా ప్రజలందరిలో అవగాహన కల్పించాలని సీఎస్‌లను కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ఆదేశించారు.
ఇదీ చదవండి : ఏప్రిల్ జీతాలపై ప్రభుత్వం క్లారిటీ!