14వ ఆర్థిక సంఘం కాలంలో గత అయిదేళ్లూ కేంద్రం నిధులు 4.305 శాతం చొప్పున ఆంధ్రప్రదేశ్‌కు విడుదలయ్యేవి. తాజాగా 15వ ఆర్థిక సంఘం లెక్కల ప్రకారం అది 4.111 శాతానికి తగ్గింది. అంటే.. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల వాటాలో రాష్ట్రానికి వచ్చే నిధుల్లో రూ.1521.31 కోట్లు తగ్గిపోనుంది. ఈ సిఫార్సులు ఇలాగే కొనసాగుతాయని, కాబట్టి 15వ ఆర్థిక సంఘం పదవీకాలం అయిదేళ్లపాటూ ఇదే ప్రభావం కొనసాగుతుందని ఆర్థికశాఖ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆశించినంత ఆదాయం లేక అల్లాడుతున్న రాష్ట్రానికి ఇది శరాఘాతమే.
13 శాతం తగ్గిన రెవెన్యూ వసూళ్లు
గతేడాది డిసెంబర్ నెలాఖరు వరకు రాష్ట్రానికి వివిధ రూపాల్లో వచ్చిన రెవెన్యూ వసూళ్లు కేవలం రూ.72,322.49 కోట్లు మాత్రమే. కిందటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 13 శాతం కన్నా తక్కువ. 2019-20 ఆర్థిక సంవత్సరం రాష్ట్రంలో రూ.2.12 లక్షల కోట్లు ఖర్చు చేయాలని బడ్జెట్‌లో అంచనాలు రూపొందించారు. తొమ్మిది నెలల్లో సగం మాత్రమే ఖర్చు చేయగలిగారు. ఆదాయ వ్యయాల అంచనాలన్నీ తప్పడం, ఆర్థిక సంఘమూ చేయూత ఇవ్వకపోవడంతో ఆర్థిక శాఖ అధికారులు ఆలోచనలో పడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు కేవలం పెట్టుబడి వ్యయం రూ.5,805.24 కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగారు. అంచనాల్లో ఇది 18 శాతం కన్నా తక్కువే.
వచ్చేది రూ.32,237.68 కోట్లే
వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21)లో రాష్ట్రానికి కేంద్ర పన్నుల్లో వాటాగా రూ.32,237.68 కోట్లు రానున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో పేర్కొన్నారు. 14వ ఆర్థిక సంఘం కేటాయించిన వాటా ప్రకారం చెల్లించినా రాష్ట్రానికి మరో రూ.1521.31 కోట్లు అదనంగా వచ్చేవి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక సంఘానికి గతేడాది అక్టోబరులో నివేదిక సమర్పించింది. అప్పటి లెక్కల ప్రకారం 2020-21లో కేంద్ర పన్నుల్లో వాటాగా రూ.44,509 కోట్లు దక్కుతాయని అంచనా వేసింది. వాస్తవానికి వచ్చేసరికి అవన్నీ తారుమారయ్యాయి.
ఏం కోరాం? ఏమిచ్చారు?
15వ ఆర్థిక సంఘం 2018 అక్టోబరులో ఒకసారి, 2019 నవంబరులో మరోసారి రాష్ట్రానికి వచ్చింది. ఆ రెండు సందర్భాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారులు నివేదికలు ఇచ్చారు. ముఖ్యమంత్రులు రాష్ట్ర పరిస్థితిని వివరించి ఇతోధికంగా సాయం చేయాలని కోరారు. కానీ ఆర్థిక సంఘం ఆలకించలేదు.
* డివిజినల్ పూల్‌లో రాష్ట్రానికి పంచే నిధులను 42 నుంచి 50 శాతానికి పెంచాలని రాష్ట్రం కోరింది. పెంచకపోగా 42 నుంచి 41 శాతానికి తగ్గించడం గమనార్హం.
* 25 శాతం జనాభాను, 47.5 శాతం ఆదాయ వ్యత్యాసాన్ని పరిగణనలోకి తీసుకుని నిధుల శాతాన్ని పెంచాలని రాష్ట్రం కోరింది. అయితే ఆర్థిక సంఘం 15 శాతం జనాభాను, 45 శాతంగా ఆదాయ వ్యత్యాసాన్ని లెక్కలోకి తీసుకుంది. దీంతో నిధుల వాటా తగ్గిపోయింది.
ఇదీ చదవండి: పద్దు 2020: రైతుల ఆదాయం రెట్టింపునకు బడ్జెట్ గుళికలివే