కరోనా నివారణ, సహాయక చర్యల్లో భాగంగా ప్రత్యేక ప్యాకేజి ప్రకటించిన కేంద్రానికి అభినందనలు తెలుపుతూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. జనతా కర్ఫ్యూ, 21రోజులు లాక్ డౌన్ ప్రకటించడంతో పాటు తాజాగా ప్రకటించిన లక్షా 75వేల కోట్ల ప్యాకేజి సరైన దిశలో సరైన మార్గదర్శకాలని పేర్కొన్నారు. ఇదే తరహాలో సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమల రంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగం కరోనా బెడద వల్ల దెబ్బతినకుండా చూడాలని కోరారు. ధనిక, పేద తేడా లేకుండా కరోనా మహమ్మారి అన్నివర్గాల ప్రజలు ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద రైతులకు 16వేల కోట్లు పంపిణీకి ముందుకు రావడం శుభపరిణామని పేర్కొన్నారు. పేద మహిళలకు నెలకు 500 రూపాయల ఎక్స్ గ్రేషియా, 3నెలలు ఉచితంగా వంటగ్యాస్ సిలిండర్లు అందించటం ప్రశంసనీయమంటూ కొనియాడారు.
ఇవీ చదవండి: కరోనా వచ్చిందని భయంగా ఉందా? తెలుసుకోండి ఇలా...