ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు ఉద్యోగులకు సంబంధించిన ‘ఆరోగ్య భద్రత పథకం’ నిధులు మాయమైన ఘటనకు సంబంధించి ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకుకు చెందిన ఆరుగురు సిబ్బందిపై.. సీబీఐ కేసు నమోదు చేసింది. నేరపూరిత కుట్ర, విశ్వాస ఘాతుకం, దుష్ప్రవర్తన, నిధుల దుర్వినియోగం అభియోగాలను వీరిపై మోపింది. వీరి చర్యల వల్ల ఐవోబీకి రూ.4.56 కోట్ల మేర నష్టం కలిగిందని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.
బ్యాంకు విజయవాడ ప్రాంతీయ కార్యాలయం రీజనల్ రిసోర్సెస్ మేనేజర్ హేలి వీపూరి, మంగళగిరిశాఖ అసిస్టెంట్ మేనేజర్లు వి.సురేష్, కె.శిరీష, డి.నరసింహ మురళి, గుమస్తాలు ఎం.ఆదినారాయణ, ఎం.ప్రవీణ్ శ్యామ్‌తోపాటు వివరాలు తెలియని మరికొందరు ప్రభుత్వోద్యోగులు ఈ నిధులను కొల్లగొట్టారంటూ చీఫ్ రీజనల్ మేనేజర్ బి.వెంకట నారాయణ ఫిర్యాదు చేయడంతో సీబీఐ ఈ కేసు నమోదు చేసింది.
ఆరోగ్య భద్రత పథకం నిధుల నిర్వహణకు సంబంధించిన కార్యదర్శి మంగళగిరిలోని ఈ బ్యాంకు శాఖలో ఒక్కోటి రూ.90లక్షల విలువైన 4 వేర్వేరు డిపాజిట్లు చేశారు. సేవింగ్స్ ఖాతాలో రూ.68.84 లక్షలు ఉంచారు. డిపాజిట్దారు నుంచి ఎలాంటి వినతి లేకుండా పైన పేర్కొన్న నిందితులు అసలు, వడ్డీ మొత్తాలను కలిపి వేరే ఖాతాల్లోకి మళ్లించి మాయం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన సీబీఐ.. దర్యాప్తు చేయనుంది.
ఇదీ చదవండి: