సీబీఐ, ఈడీ కోర్టులో సీఎం జగన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ దాఖలు చేసిన ఐదు కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. తన బదులుగా సహ నిందితులుగా ఉన్న జగతి పబ్లికేషన్ తరఫు ప్రతినిధి హాజరయ్యేందుకు అనుమతివ్వాలన్న జగన్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఈడీ కేసుల్లో మొదటి నిందితుడిగా ఉన్న జగన్.. తాను ముఖ్యమంత్రిగా ప్రజావిధుల్లో ఉన్నందున వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. జగన్ అభ్యర్థనపై ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తీవ్రమైన ఆర్థిక నేరాల్లో నిందితులు కచ్చితంగా హాజరు కావాలని వాదించింది. ఈడీ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం.. జగన్ పిటిషన్‌ను కొట్టివేసింది.
న్యాయస్థానం అసహనం
అక్రమాస్తుల కేసులో శుక్రవారం జరిగిన విచారణకు మినహాయింపు ఇవ్వాలని ముందుగానే సీబీఐ, ఈడీ కోర్టును జగన్ కోరారు. సీబీఐ, ఈడీ కేసుల్లో ప్రతీ శుక్రవారం ఏదో ఒక కారణం చెప్పి మినహాయింపు కోరుతున్నారని న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. చివరకు నిన్నటి హాజరుకు మినహాయింపునిచ్చిన న్యాయస్థానం.. ఈనెల 31న కచ్చితంగా హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. తదుపరి విచారణకు జగన్ హాజరు కాకపోతే తగిన ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది. శుక్రవారం జరిగిన విచారణకు రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయిరెడ్డి, పారిశ్రామికవేత్తలు పెన్నా ప్రతాప్ రెడ్డి, ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డి, ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, మన్మోహన్ సింగ్ హాజరయ్యారు.
ఇదీ చదవండి : శ్రేయస్, రాహుల్ దూకుడు.. కివీస్‌పై భారత్ విజయం