గ్రామ పంచాయితీకి ఆలస్యంగా వచ్చారని తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో పంచాయతీ పెద్దలు ఓ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారు. ఆరు నెలల క్రితం జరిగిన ఈ ఘటన.. భాదితులు డీఎస్పీ కార్యాలయానికి రావడంతో వెలుగులోకి వచ్చింది.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. దోమకొండ మండల కేంద్రంలోని ఓ కులానికి చెందిన నల్లపు చంద్రం, రాజు, నరేశ్లకు భూమి విషయంలో వారి బంధువులతో గొడవలు జరుగుతున్నాయి. దీనిపై గ్రామంలో పంచాయితీ జరిగినా సమస్య పరిష్కారం కాలేదని.. బాధితులు వాపోయారు. మరోసారి పంచాయితీకి రమ్మని చెప్పారని.. నిర్ణీత సమయం కంటే 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చామంటూ.. తమ మూడు కుటుంబాలను కుల బహిష్కరణ చేశారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై గత సంవత్సరం జులైలో దోమకొండ పోలీసులకు ఫిర్యాదు చేయడానికే వెళ్తే పట్టించుకోలేదని ఆరోపించారు. ఆగస్టులో ఫిర్యాదు నమోదు చేసినా.. ఇంతవరకు చర్యలు తీసుకోలేదని అన్నారు. అసలు కుల బహిష్కరణ జరగలేదని.. అనవసరంగా అబద్ధం చెబుతున్నారంటూ ఎస్సై మాట్లాడారని బాధితులు చెప్పారు.
ఆరు నెలలుగా.. వివాహాలకు, శుభకార్యాలకు పిలవకుండా కులపెద్దలు ఇబ్బందులు పెడుతున్నారని బాధితులు వాపోయారు. ఎవరైనా పిలిస్తే వారికి జరిమానా విధిస్తామని బెదిరిస్తున్నారని చెప్పారు. భూమి పంచాయితీ పరిష్కారం చేసుకుంటేనే కులంలోకి రానిస్తామని చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని డీఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. కుల పెద్దల నుంచి తమకు ప్రాణహాని ఉందని అధికారులకు మొరపెట్టుకున్నారు.
ఇదీచూడండి: SP VISHAL GUNNI:పాలడుగు అత్యాచార కేసులో ఆరుగురు అరెస్టు