'రైతులు అనధికార కనెక్షన్లు, అదనపు లోడ్ కనెక్షన్లు కలిగి ఉంటే, నిర్దేశిత డెవలప్‌మెంట్ ఛార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించిన తర్వాత వాటిని క్రమబద్ధీకరిస్తారు’’ ఇదీ ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్తుకు నగదు బదిలీ పథకంపై ఇచ్చిన ఉత్తర్వుల్లోని సారాంశం. అదనంగా వాడే లోడ్‌లో హెచ్‌పీకి రూ.1,200 వంతున అభివృద్ధి ఛార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.60 చెల్లించాలని పేర్కొంది. ఈ లెక్కన 5 హెచ్‌పీ అదనపు లోడ్ వినియోగిస్తున్న రైతు రూ.6,360 చెల్లించాలి. రాష్ట్రంలోని 17.54 లక్షల వ్యవసాయ కనెక్షన్లలో అదనపు లోడ్‌ను సుమారు 5 లక్షల మంది వాడుతున్నట్లు అంచనా. మొత్తంగా డిస్కంలు సుమారు రూ.318 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. నగదు బదిలీ పథకాన్ని ఏప్రిల్ నుంచి అమలు చేయనున్నందున ఈ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందా? రైతులపై మోపుతుందా? అన్నది తేలాల్సి ఉంది. అన్ని కనెక్షన్లను పరిశీలించాక అదనపు లోడ్ వాడుతున్న రైతుల వివరాలను డిస్కంలు గుర్తించనున్నాయి.
ఇవీ సందేహాలు!
* ప్రస్తుతం వార్షిక సాగు విద్యుత్తు వినియోగం 12,232 మిలియన్ యూనిట్లుగా లెక్కగట్టి అందుకయ్యే ఛార్జీల మొత్తం రూ.8,353.6 కోట్లు భరించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. వాస్తవ లోడ్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఈ వాడకం సుమారు 20 వేల మిలియన్ యూనిట్ల వరకు ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ భారం ఎలా భరిస్తారన్నది స్పష్టత రావాల్సి ఉంది.
* ఏటేటా భూగర్భజలాలు లోతుకు పడిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రైతులు అనధికారికంగా 10 హెచ్‌పీ మోటార్లను అమర్చుకుంటున్నారు. తద్వారా కరెంటు వాడకం పెరిగింది. రాష్ట్రంలో సుమారు 20 ఏళ్లుగా వ్యవసాయ విద్యుత్ మీటర్లు లేనందున రైతు వారీగా వాస్తవ వాడకంపై కచ్చితమైన లెక్కలు లేవు. ఇకపై అదనపు వినియోగాన్ని లెక్కిస్తే అధిక సామర్థ్యం గల మోటార్లు వాడుతున్న రాయలసీమ రైతులపై ప్రభావం పడనుంది.
* రాయలసీమ జిల్లాల్లో మూణ్నాలుగు చోట్ల బోర్లు వేసి ఒకే రైతు పేరిట కనెక్షన్లు తీసుకున్న వారు లక్షల్లో ఉన్నారు. కనెక్షన్ కోసం చేసిన దరఖాస్తులో 5 హెచ్‌పీగా పేర్కొన్నా.. 10 హెచ్‌పీ సామర్థ్యం ఉన్న మోటార్లను బిగించుకొని నీరు తోడుకుంటున్నారు. ఇకపై ఈ అదనపు వినియోగం మొత్తం లెక్కలోకి రానుంది. ఒకే రైతు రెండు మూడు కనెక్షన్లను తీసుకున్నా ఇప్పటిదాకా ఒక్కో కనెక్షన్‌కు విడిగా లోడ్‌ను లెక్కించటం వల్ల ఉచిత విద్యుత్ పథకాన్ని పొందుతున్నారు. ఒకే రైతు పేరిట ఉన్న అన్ని కనెక్షన్లను కలిపి లోడ్‌ను లెక్కించి కార్పొరేట్ రైతుగా పరిగణిస్తే నగదు బదిలీ వర్తిస్తుందా?అన్నది స్పష్టత లేదు.
* తిరుపతి కేంద్రంగా ఉన్న దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో 10.02 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. సుమారు 5 లక్షల కనెక్షన్ల వరకు అదనపు లోడ్ వినియోగిస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: రైతులు లబ్ధి పొందేలా చర్యలు తీసుకోండి: సీఎం జగన్