Case filed against actor Vishwak Sen: సినిమా ప్రచారం పేరిట ప్రాంక్ వీడియోతో న్యూసెన్స్ క్రియేట్ చేశారంటూ నటుడు విశ్వక్‌సేన్‌పై హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. విశ్వక్‌పై తగిన చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నట్టు ఆయన తెలిపారు. సినిమా ప్రచారం పేరుతో పబ్లిక్‌కు అంతరాయం కలిగిస్తున్నారన్నారు. బహిరంగ ప్రదేశాల్లో సినిమా ప్రమోషన్లు చేయనీకుండా పోలీసులకు ఆదేశాలివ్వాలని హెచ్ఆర్‌సీని కోరినట్టు తెలిపారు. హీరోలు చేసే ఇలాంటి ప్రయత్నాలు యువతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, యూట్యూబ్‌లో ఉన్న ఇలాంటి వీడియోలన్నింటినీ తొలగించాలన్నారు.
ఇదీ జరిగింది... "ఎక్కడ? అర్జున్ కుమార్ అల్లం ఎక్కడ?" అంటూ నడి రోడ్డు మీద ఒక యువకుడు హల్చల్ చేశాడు. యంగ్ హీరో విశ్వక్ సేన్ కారు ముందు పడడమే కాకుండా.. "30 ఏళ్లు వచ్చినా అర్జున్ కుమార్ అల్లానికి పెళ్లి కాకపోవడం ఏమిటి? అతడిని నా దగ్గరకు తీసుకురండి.. లేదంటే నన్ను అతడి దగ్గరకు తీసుకు వెళ్లండి.. లేదంటే అంటించేయండి" అంటూ.. ఒంటి మీద పెట్రోల్ పోసుకున్నట్టు ఒక డబ్బా ఎత్తేశాడు. తనకూ పెళ్లి కావడం లేదని ఆత్మహత్యాయత్నం చేశాడు. అతడిని అడ్డుకున్న విశ్వక్ సేన్.. ఆ కుర్రాడిని సముదాయించి కారులో ఎక్కించి పంపించాడు. ఆ తర్వాత విశ్వక్ సేన్ ఆటోలో వెళ్లిపోయాడు. ఇదంతా సినిమా ప్రమోషన్‌లో భాగంగానే చేశారని చిత్ర బృందం ప్రకటించింది. బహిరంగ ప్రదేశంలో సినిమా ప్రచారం కోసం ఇంత హంగామా చేయాలా? అంటూ జనం ప్రశ్నిస్తున్నారు. ఇంతలా దిగజారి ప్రాంక్ పేరుతో న్యూసెన్స్ చేయడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు.
విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన 'అశోకవనంలో అర్జున కల్యాణం' ఈ నెల 6న విడుదలకానుంది. విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుక్సర్ థిల్లాన్ కథానాయికగా నటించింది. ఈ సినిమాను బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మించారు.
ఇదీ చదవండి: CBN LETTER: జంగిల్ రాజ్ పాలనలో ప్రజలకు భద్రత కరవైంది.. డీజీపీకీ చంద్రబాబు లేఖ