ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సేవలపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం.. సచివాలయంలో సమావేశమైంది. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించే అంశంపై అధ్యయనం చేసేందుకు నియమించిన ఈ ఉపసంఘం.. ఆర్థిక మంత్రి బుగ్గన అధ్యక్షతన వివిధ అంశాలపై చర్చించింది. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో ఎంతమంది పనిచేస్తున్నారు...? వారి హోదాలేమిటన్న అంశంపై వివరాలను సేకరించాలని నిర్ణయించింది. అనంతరం తదుపరి నిర్ణయానికి రావాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తే ఎంతమేర ఖజానాకు భారం అవుతుందన్న అంశాన్నీ ఉపసంఘం చర్చించినట్టు సమాచారం. ఈ సమావేశానికి పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉపముఖ్యమంత్రి ఆళ్లనాని, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ , విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఇదీ చదవండి: