Booster dose: కొవిడ్ నియంత్రణకు 75 రోజుల పాటు నిర్వహించే బూస్టర్ డోస్ పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని.. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ ఆదేశించారు. ప్రధానమంత్రి అధ్యక్షతన జరగనున్న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో చర్చించే అంశాలపై వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ఆయన దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
‘18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కొవిడ్ వ్యాక్సిన్ అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలి’ అని సూచించారు.
3.9 లక్షల డోసులు కావాలి: కేంద్రానికి విజ్ఞప్తి.. రాష్ట్రంలో శుక్రవారం నుంచి బూస్టర్ డోసు పంపిణీ ప్రారంభమైందని ప్రభుత్వం తెలిపింది. 3.40 కోట్ల మందికి బూస్టర్ డోసు ఇవ్వాలని, తొలిరోజు 55వేల మందికి టీకా అందించామని వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వద్ద 13 లక్షల డోసులు ఉన్నట్లు తెలిపింది. అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరో 3.9 లక్షల డోసులు పంపించాలని కేంద్రానికి లేఖ రాసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఓ ప్రకటనలో తెలిపారు.
పాత పద్ధతిలోనే అన్ని పీహెచ్‌సీలు, గ్రామ సచివాలయాలు, ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో బూస్టర్ డోసు పంపిణీ జరుగుతోంది. తొలి రెండు డోసులు ఏ రకం టీకా తీసుకుంటే అదే టీకాను బూస్టర్ డోసుగా పొందాలని ప్రభుత్వం సూచించింది.
ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా.. ‘ఆగస్టు 11 నుంచి 17 వరకు ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఆవిష్కరించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ప్రతి ఇంటికీ నిరంతరం స్వచ్ఛమైన తాగునీటిని అందించే లక్ష్యంతో చేపట్టిన జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి’ అని గౌబ ఆదేశించారు. జల్ జీవన్ మిషన్ అమలుకు సంబంధించి రూ.వెయ్యి కోట్ల అంచనాలతో సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసినట్లు ఏపీ సీఎస్ సమీర్‌శర్మ వివరించారు.
ఇవీ చూడండి: