జైలులో ఉన్న విప్లవ రచయిత వరవరరావు ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలని వైద్యులను బాంబే హైకోర్టు ఆదేశించింది. వరవరరావు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని, ఆయనను నానావతి ఆసుపత్రికి తరలించాలని ఆయన భార్య హేమలత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ ఏకే మేనన్‌తో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఆయన తరఫు లాయర్ ఇందిరా జైసింగ్ వాదనలు వినిపించారు.
ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని ఇందిరా జైసింగ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జైసింగ్ వాదనలను ఎన్‌ఐఏ తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ వ్యతిరేకించారు. ఖైదీలు తమ వైద్యులను ఎంచుకునే వెసులుబాటు కల్పిస్తే రేప్పొద్దున ప్రతి ఒక్క ఖైదీ తమను నానావతికి తరలించాలని కోరుతారన్నారు. ఇది ప్రభుత్వ వైద్యులు, ఆసుపత్రుల విశ్వసనీయతను తక్కువ చేయడమే అవుతుందని పేర్కొన్నారు.
దీనిపై కోర్టు స్పందిస్తూ.. నిందితుడి ఆరోగ్య పరిస్థితి తెలీకుండా ఆస్పత్రికి తరలించడం సబబు కాదని పేర్కొంది. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలని నానావతి ఆసుపత్రి వైద్యులను ఆదేశించింది. వీడియో మెడికల్ చెకప్ చేపట్టాలని, అది వీలు కాని పక్షంలో నేరుగా ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలని సూచించింది. దీనికి సంబంధించిన నివేదికను నవంబర్ 16లోగా సమర్పించాలని ఆదేశించాలంటూ విచారణను వాయిదా వేసింది.
ఇవీ చూడండి: