Bandi Sanjay on CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడైనా జైలుకు వెళ్లొచ్చని ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సీఎం అవినీతిపై కేంద్రం ఆగ్రహంగా ఉందని.. అందుకే చర్యలకు సిద్ధమైందన్నారు. ఈ విషయం తెలిసే కమ్యూనిస్టులు, ఇతర విపక్ష నేతలతో కేసీఆర్ భేటీ అవుతున్నారని ఆరోపించారు. జైలుకు వెళ్లొచ్చనే విషయం కేసీఆర్‌కు తెలిసిపోయిందని పేర్కొన్నారు.
సానుభూతి కోసమే ప్రయత్నాలు
కేంద్ర ప్రభుత్వం... జైలుకు పంపితే సానుభూతి కోసం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని భాజపా యువ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని బండి సంజయ్ ప్రారంభించారు.
అవినీతిపరులందరూ కూడా ఒక గొడుకు కిందకు వస్తున్నారు. వాళ్లంతా వేలకోట్లు సంపాదించుకున్నారు. ఈయనేమో లక్షల కోట్లు కాజేశారు. అందుకే దీనికోసం శిక్షణ ఏర్పాటు చేసినారు. వాళ్లంతా ఇప్పుడొక పార్టీ పెట్టుకుంటారు. అదేంటంటే 'దోచుకోండి.. దాచుకోండి' అనే పార్టీ. సీఎం ఎక్కడున్నా కూడా చర్యలు తప్పవు. ఈయనో పెద్ద అవినీతి తిమింగలం. సీపీఎం వాళ్లతో మీటింగ్‌లు అంతా డ్రామా. అంతా తెలిసే సానుభూతి కోసం ప్రయత్నాలు. తెలంగాణ ప్రజలు మీ డ్రామాను గమనిస్తున్నరు. నువ్వు ఫామ్‌హౌస్‌లో ఉన్నా.. ఎక్కడ ఉన్నా కూడా నిన్ను జైలుకు పంపుడే.
-బండి సంజయ్, తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు