కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షాకు భాజపా ఎంపీలు జీవీఎల్, సీఎం రమేశ్ లేఖ రాశారు. ఏపీలో ఇటీవల జరిగిన ఘటనలపై హోంశాఖ జోక్యం చేసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థ లేకుండా పోయిందని లేఖలో ప్రస్తావించారు. హిందువులే లక్ష్యంగా అనేక ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ ఘటనలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర పోలీసులు ఏం చేశారు...?
ఏపీలో వైకాపా ప్రభుత్వం వివక్షపూరితంగా వ్యవహరిస్తోంది. హిందూ ఆలయాలపై దాడులు జరిగితే ఓ విధంగా స్పందిస్తోంది. ఇతర ప్రార్థనా మందిరాలపై దాడులు జరిగితే మరోలా స్పందిస్తోంది. చర్చిపై రాళ్లు విసిరారని 41 మందిని అరెస్టు చేశారు. హిందూ ఆలయాలపై దాడులు జరిగితే మతిస్థిమితం లేనివాళ్ల చర్య అంటున్నారు. అంతర్వేది ఘటనపై సీబీఐకి అప్పగించి చేతులు దులుపుకున్నారు. సీబీఐకి కేసు ఇచ్చేలోపు రాష్ట్ర పోలీసులు ఏం చేశారు?- జీవీఎల్, ఎంపీ
ప్రజాప్రతినిధులను విడుదల చేయాలి..
'తిరుమల బస్సు టికెట్లపై మత ప్రచారంతో ప్రభుత్వ వైఖరి బయటపడింది. హిందూ ఆలయాలపై దాడులు జరిగితే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నా పట్టించుకోవడం లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నిరసన తెలిపే హక్కు ఉంది. భాజపా నేతలు, హిందువులు నిరసన చేపడితే అరెస్టు చేస్తున్నారు. అరెస్టు చేసిన ప్రజాప్రతినిధులను విడుదల చేయాలి'- సీఎం రమేశ్, ఎంపీ
ఇదీ చదవండి