SOMUU FIRES ON CM JAGAN : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఆనాటి చంద్రబాబు కుటుంబ పాలన, ఈనాటి జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలన వలన కుంటుపడిందని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలను ఇస్తే.. దోచుకోవడమే పరమావధిగా వైకాపా పాలన సాగుతుందన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రైస్, ఇసుక, ల్యాండ్ మాఫియా రాజ్యమేలుతుందని ఆగ్రహించారు. జగన్ మోహన్ రెడ్డి రూ.25 .. మద్యాన్ని రూ.200 కు అమ్మీ ఏడాదిలో ఒక్కొక్కరి నుంచి 1.20 లక్ష రూపాయలు లాక్కొని, సంక్షేమం పేరుతో మేకప్ చేస్తున్నారన్నారు.
రాజధాని కట్టకుండా రైతులను రోడ్డు మీద వదిలేసి, పోలవరాన్ని పట్టించుకోకుండా కేంద్రంపై నిందలు వేస్తున్నారన్నారు. అధిక శాతంలో కేంద్రం ఇస్తున్న నిధులతో సంక్షేమ పథకాలను నిర్వహిస్తూ, కేంద్రంపై అసత్య ప్రచారం చేయడం తగదన్నారు. కేంద్రం అమలు చేస్తున్న ఎన్ఆర్ఈజీఎస్, ఐసీడీఎస్ ప్రాజెక్టులలో సైతం అవినీతి తాండవం చేస్తుందని ఆరోపించారు. ఐసీడీఎస్ ద్వారా నాణ్యమైన బియ్యాన్ని అందించేందుకు కేంద్రం సహకారం అందిస్తుంటే.. నాసిరకం బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా బియ్యం మాఫియాకు కేంద్రంగా మారిందన్నారు.
రాష్ట్రంలో ల్యాండ్, శ్యాండ్, రైస్, మైనింగ్ మాఫియాలు పనిచేస్తున్నాయి. అప్పులు ఎందుకు చేస్తున్నారో, ఎవరి కోసం చేస్తున్నారో జగన్ చెప్పాలి. బంగారం దొరుకుతుంది కానీ.. ఇసుక దొరకట్లేదు. కేంద్ర నిధులను వాడుకుంటూ జగన్ తన ఘనతలా చెబుతున్నారు.-సోము వీర్రాజు
రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం సహకారాలు అందించకుండా వెనకడుగు వేయడం వల్లనే ప్రాజెక్టులు వెనక్కి పోతున్నాయన్నారు. రాష్ట్రంలో తాము ఎయిమ్స్ వైద్యశాలను ఏర్పాటు చేస్తే.. కనీసం మంచి నీటిని కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉందని ధ్వజమెత్తారు.
ఇవీ చదవండి: